NTR Trust: ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన భవన నిర్మాణం

Nara Bhuvaneshwari lays foundation stone for construction of new building of NTR Trust in Vijayawada
  • ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు
  • సేవా కార్యక్రమాలను ఆపన్నులకు చేరువచేసేందుకు విజయవాడలో నూతన భవనం 
  • భవన నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్న నారా భువనేశ్వరి
  • జీ+ప్లస్ 5 విధానంలో ట్రస్ట్ భవన్ నిర్మాణం
  • తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు
ప్రజాసేవే ధ్యేయంగా, ఆపన్నులకు అండగా నిలుస్తూ సమర్థవంతమైన సేవలు అందిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ విజయవాడలో ఏర్పాటు కానుంది. ట్రస్ట్ స్థాపించాక హైదరాబాద్ కేంద్రంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేవా కార్యక్రమాలను ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీలుగా రాష్ట్రంలో నూతన భవనం నిర్మించబోతున్నారు. 

విజయవాడలోని టీచర్స్ కాలనీ, సాయిబాబా టెంపుల్ జంక్షన్ రోడ్డులో జీ+5 విధానంలో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు. ఈ నూతన భవనానికి రేపు (గురువారం) ఉదయం 9.12 నిమిషాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేయ‌నున్నారు. 

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం నిర్మించనున్న‌ట్లు ఇటీవల నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో భువనేశ్వరి ప్రకటించారు. ఆమె ప్రకటించిన అనతికాలంలోనే భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ట్రస్ట్ భవన్ అందుబాటులోకి వస్తే పేదలకు విద్య, వైద్య సాయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. 

నూతనంగా నిర్మించే ఈ ట్రస్ట్ భవనంలో తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు కానున్నాయి. తలసేమియా రోగులకు అవసర‌మైన వైద్య సేవలను ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందిస్తారు. తలసేమియా కేర్ సెంటర్ నుంచే వైద్య సేవలు, రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలను అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది.
NTR Trust
Nara Bhuvaneshwari
Vijayawada
Andhra Pradesh

More Telugu News