Gottipati Ravi Kumar: వైసీపీ హయాంలోనే ఛార్జీలు పెంచి, వారే ధర్నాలు చేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Gottipati Ravikumar blames YCP government over power charges hike
  • జగన్ హయాంలో తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్న మంత్రి
  • చివరి రెండేళ్లలో ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేశారని ఆగ్రహం
  • 2014-19 మధ్య టీడీపీ ఉన్నప్పుడు ఛార్జీలు పెంచలేదని వెల్లడి
విద్యుత్ ఛార్జీలను పెంచింది వైసీపీ హయాంలోనేనని, కానీ ఇప్పుడు ఛార్జీలు పెంచారని ఆదే పార్టీ ఆరోపిస్తోందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు మళ్లీ వారే ధర్నాలు చేస్తూ కొత్త సంప్రదాయాన్ని తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు.

శాసనమండలి సమావేశాల్లో భాగంగా విద్యుత్ ఛార్జీల అంశంపై ఆయన మాట్లాడుతూ, జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీలను తొమ్మిదిసార్లు పెంచారని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చివరి రెండేళ్లలో ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేసిందని ఆరోపించారు.

2014-2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఛార్జీలను పెంచలేదని గుర్తు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా వారికి అప్పగించామని తెలిపారు. ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రి అనగాని

జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. మండలిలో పలువురు ఎమ్మెల్సీలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ప్రశ్నలు వేశారు. మంత్రి మాట్లాడుతూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని గత వైసీపీ ప్రభుత్వం కనీసం మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించలేదన్నారు.

అస్తవ్యస్తంగా పునర్వ్యవస్థీకరణ చేశారని విమర్శించారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఎమ్మిగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చారనే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు తెలిపారు.
Gottipati Ravi Kumar
Telugudesam
Andhra Pradesh
YSRCP

More Telugu News