YS Sharmila: ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఇప్పుడు కండిషన్ అప్లై అంటారా?: షర్మిల విమర్శలు

Sharmila fires on AP Govt over free bus journey fro women assurance
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన కూటమి
  • జిల్లా స్థాయి వరకే పరిమితం అంటూ తాజాగా వెల్లడి
  • ఇది మోసం చేయడమేనంటూ షర్మిల విమర్శలు
  • రాష్ట్రస్థాయిలో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా అమలవుతుందని, అయితే ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం తెలిసిందే. దీనిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు కండిషన్ అప్లై అనడం దారుణం అని షర్మిల విమర్శించారు. 

"మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం జిల్లా స్థాయి వరకే పరిమితం అని చెప్పడం మోసం. అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేక ఇలాంటి సాకులు చెబుతున్నారు. ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రాష్ట్రాల్లో పర్యటిస్తూ విహార యాత్రలు చేశారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టిన ఈ ప్రభుత్వం... రేపు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చే సరికి నియోజకవర్గం, మండల పరిధి వరకే ఫ్రీ అంటుందేమో" అని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణమేనని షర్మిల స్పష్టం చేశారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంతా ఉచితమే... ఆధార్ కార్డు చూపిస్తే చాలు... ఎంతదూరమైనా జీరో టికెట్ అని వివరించారు. 

"ఇటువంటి మంచి పథకాన్ని, అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడంలేదు. నెలకు రూ.350 కోట్లు మహిళల కోసం ఆర్టీసీకి ఇవ్వడానికి ప్రభుత్వానికి ధైర్యం చాలడంలేదు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా? తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని, రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండాలని మహిళల తరఫున కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
YS Sharmila
Free Bus Journey
Women
Congress
TDP-JanaSena-BJP Alliance

More Telugu News