Team Pakistan: కోహ్లీని సిక్స్ కొట్టమని రెచ్చగొట్టాను... కానీ అతను ఆవేశపడలేదు: పాకిస్థాన్ స్పిన్నర్

I asked Virat Kohli to hit me for a six says Abrar Ahmed
  • కోహ్లీకి బౌలింగ్ చేయాలనేది తన చిన్ననాటి కల అన్న అబ్రార్
  • కోహ్లీ మంచి ఆటగాడు మాత్రమే కాదు... మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంస
  • కోహ్లీకి ఏదో ఒకరోజు బౌలింగ్ చేస్తానని చెప్పేవాడినన్న అబ్రార్
తన బౌలింగులో సిక్స్ కొట్టమని భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కవ్వించానని పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వెల్లడించాడు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదని, మంచి మనసున్న వ్యక్తి అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీకి బౌలింగ్ చేసే అవకాశం అబ్రార్‌కు లభించింది. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కానీ అబ్రార్‌కు ఈ మ్యాచ్ తీపిగుర్తుగా నిలిచింది!

అబ్రార్ 'టెలికం ఆసియా స్పోర్ట్స్'తో మాట్లాడుతూ, కోహ్లీకి బౌలింగ్ చేయాలనేది తన చిన్ననాటి కల, ఇది ఇటీవలి దుబాయ్ మ్యాచ్ ద్వారా నిజమైందని అన్నాడు. కోహ్లీకి బౌలింగ్ తనకు సవాల్ అని, పటిష్టమైన బౌలింగ్‌తో కోహ్లీని అడ్డుకున్నానని ఆనందం వ్యక్తం చేశాడు. తన బౌలింగులో సిక్స్ కొట్టమని తాను విరాట్ కోహ్లీని రెచ్చగొట్టానని, కానీ అతను ఏమాత్రం ఆవేశపడలేదని తెలిపాడు. కోహ్లీ మంచి ఆటగాడు మాత్రమే కాదని, గొప్ప మనసున్న వ్యక్తి అన్నారు.

నువ్వు అద్భుతంగా బౌలింగ్ చేశావంటూ మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పాడని, అది తనకు మరిచిపోలేని రోజు అని అబ్రార్ అన్నాడు. తాను చిన్నప్పటి నుండి కోహ్లీని ఆరాధించేవాడినని, ఏదో ఒకరోజు అతనికి బౌలింగ్ చేస్తానని అండర్-19 ఆటగాళ్లతో తరచూ చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు. కోహ్లీ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని, వికెట్ల మధ్య పరుగెత్తే విధానం కళ్లు చెదిరేలా ఉందని అన్నారు. అతనొక ప్రత్యేకమైన క్రికెటర్ అని ప్రశంసించాడు.
Team Pakistan
Team India
Virat Kohli
Champions Trophy 2025

More Telugu News