Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఇదొక ఒక మైలురాయి: మంత్రి నారా లోకేశ్

Lokesh terms Mou with TPREL a key milestone
  • టాటా పవర్ అనుబంధ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
  • నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ
  • రెన్యూవబుల్ ఇంధన లక్ష్యాల దిశగా ఇది కీలక ముందడుగు అన్న లోకేశ్
టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్,  ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఇది రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన అడుగు. 

ఈ ఒప్పందం ప్రకారం టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 7 గిగావాట్ల (7 వేల మెగావాట్లు) పునరుత్పాదక ఇంధన (RE) అభివృద్ధి అవకాశాలను అన్వేషిస్తాయి. ఇందులో భాగంగా సౌర, పవన,  హైబ్రిడ్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. 

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఇదొక ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో రెన్యూవబుల్ ప్రాజెక్టులు ఏర్పాటు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. 

"ఆంధ్రప్రదేశ్ లో రెన్యూవబుల్ ఎనర్జీ  రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌ భాగస్వామ్యం కావడాన్ని స్వాగతిస్తున్నాం.  టాటా గ్రూప్, ఏపీ ప్రభుత్వం నడుమ దీర్ఘకాలిక సంబంధాన్ని ఈ ఒప్పందం బలోపేతం చేస్తుంది. పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలకు ఎంవోయూ దోహదపడుతుంది. క్లీన్ ఎనర్జీ విస్తరణను వేగవంతం చేయాలన్నదే మా లక్ష్యం. రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో రూ .10 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా  7.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి" అని వివరించారు.
Nara Lokesh
TPREL
MoU
Andhra Pradesh

More Telugu News