YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో రంగన్న కీలక సాక్షి... ఆయన మృతిపై అనుమానాలున్నాయి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

Kadapa SP Ashok Kumar talks about watchman Ranganna death
  • వివేకా హత్య కేసులో ఐదుగురు సాక్షులు మృతి చెందారన్న ఎస్పీ
  • సాక్షుల మృతిపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
  • సాక్షులు కోరితే వారికి భద్రత కల్పిస్తామని స్పష్టీకరణ 
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్ మన్ రంగన్న మరణించడం పట్ల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పందించారు. వివేకా హత్య కేసులో రంగన్న కీలక సాక్షిగా ఉన్నాడని, ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. రంగన్న మృతి వెనుక ఉన్న అనుమానాలు నివృత్తి చేయడానికి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 

వివేకా మర్డర్ కేసులో ఇప్పటిదాకా ఐదుగురు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారని వెల్లడించారు. సాక్షులు శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, వాచ్ మన్ రంగన్న చనిపోయారని వివరించారు. 

సాక్షులు ఎలా చనిపోయారన్న దానిపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ వివరించారు. సిట్ లో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు ఉంటారని తెలిపారు. సాక్షులు మరణించడం వెనుక నిందితుల ప్రమేయం ఉందా అనేది ఆరా తీస్తామని, అన్ని కోణాల్లో విచారిస్తామని అన్నారు. సాంకేతిక నిపుణుల ద్వారా కూడా దర్యాప్తు జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. 

ఈ కేసులో సాక్షులను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని, సాక్షులు కోరితే వారికి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, దస్తగిరిని బెదిరించే కేసులోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
YS Viveka Murder Case
Watchman Ranganna
Police
Kadapa District

More Telugu News