Nara Lokesh: మంత్రి లోకేశ్ సమక్షంలో... వాద్వానీ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వ అవగాహన ఒప్పందం

Another MoU inked in the presence of Minister Nara Lokesh
  • ఎంవోయూపై సంతకాలు చేసిన వాద్వానీ గ్రూప్ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు
  • పాలనా సామర్థ్యం, పౌర సేవలు మెరుగుపడతాయన్న లోకేశ్
  • డిజిటల్ నైపుణ్యాలతో కూడిన శ్రామికశక్తి ఏర్పడుతుందని వెల్లడి
పరిపాలనలో ఎమర్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో  వేగం సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాద్వానీ ఫౌండేషన్ నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ ఆధారిత సర్వీస్ డెలివరీ ట్రాన్స్ ఫార్మేషన్, పాలసీ మేకింగ్, కెపాసిటీ బిల్డింగ్ ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), జనరేటివ్ ఏఐ, డ్రోన్లు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు వివిధ ప్రభుత్వ విధుల్లో సమర్థవంతంగా వినియోగానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. 

ఏపీ ప్రభుత్వం తరపున ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, వాద్వానీ ఫౌండేషన్ తరపున వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ (డబ్ల్యుజిడిటి) సీఈవో ప్రకాశ్ కుమార్ లు ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... ఏఐ వినియోగం ద్వారా పౌరసేవలు, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందని తెలిపారు. ఏఐ ఆధారిత పాలసీ ఫ్రేమ్ వర్క్ ను నిర్మించడానికి, సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి, అధునాతన డిజిటల్ నైపుణ్యాలతో కూడిన శ్రామిక శక్తిని నిర్మించడానికి  వాద్వానీ ఫౌండేషన్ సహకరిస్తుందని లోకేశ్ చెప్పారు. 

వాద్వానీ ఫౌండేషన్ డబ్ల్యుజీడీటీ సీఈవో ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ... పాలనా పరివర్తనలో ఒక మార్గదర్శక దశను ఏఐ వినియోగంతో రూపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను నైపుణ్యవంతం చేసి, తద్వారా పౌరసేవలను మెరుగుపర్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. 

ఎంవోయూ ముఖ్యాంశాలు

1.    డ్రైవింగ్ సర్వీస్ డెలివరీ ట్రాన్స్ ఫార్మేషన్ - పాలనా ఫలితాలను మెరుగుపరచడానికి, సేవా సామర్థ్యాన్ని పెంచడం, డిజిటల్ అంతరాన్ని భర్తీచేయడానికి ఇప్పటికే ఉన్న అప్లికేషన్ లలో AIని ఇంటిగ్రేట్ చేయడం.
2.    పాలసీల రూపకల్పనలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగం - డేటా విశ్లేషణ ద్వారా ఉత్పన్నమయ్యే లోతైన అంతర్దృష్టి విధాన నిర్ణయాలను మెరుగుపర్చి తద్వారా పాలనలో సులభతర విధానాలను అమలుచేయడం.
3.    ప్రోగ్రామ్ లు, స్కీమ్ ల సమీక్ష - ప్రస్తుతమున్న ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ఆప్టిమైజ్ చేయడానికి AI, డిజిటల్ పరిష్కారాలను వర్తింపజేయడం... వాటిని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా పౌర కేంద్రీకృతంగా మార్చడం.


Nara Lokesh
Wadhwani Group
AP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News