Mohammad Shami: మహ్మద్ షమీ ఓ పాపి అంటూ ముస్లిం మతపెద్దల ఆగ్రహం... క్రికెటర్ కు మద్దతుగా నిలిచిన లిరిసిస్ట్ జావేద్ ఆక్తర్

Shami gets support from renowned lyricist Javed Aktar
  • ప్రారంభమైన రంజాన్ మాసం
  • ఆసీస్ తో మ్యాచ్ లో ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించిన షమీ
  • ఉపవాసం ఉండకుండా డ్రింక్ తాగుతున్నాడంటూ షమీపై మతపెద్దల ఫైర్
  • షమీకి మద్దతు పలికిన ప్రముఖులు
ముస్లింలకు పరమ పవిత్రమైనది రంజాన్ పండుగ. ఇస్లాంను అనుసరించే వారు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించాడు. ఇది ముస్లిం మత పెద్దల ఆగ్రహానికి కారణమైంది. 

షమీ రోజా (ఉపవాసం)ను పాటించకుండా మత నియమాలను ఉల్లంఘించాడని, అతడు ఒక పాపి అంటూ ఆలిండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రిజ్వీ బర్లేవి విమర్శించారు. 

అయితే, షమీకి సోషల్ మీడియాలోనూ, క్రికెట్ ఫీల్డ్ లోనూ మద్దతు లభించింది. చాలామంది నెటిజన్లు కూడా షమీ తప్పేమీ చేయలేదని తెలిపారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ... క్రికెట్ ను, మతాన్ని కలపొద్దని విజ్ఞప్తి చేశాడు. ముఖ్యంగా, బాలీవుడ్ ప్రఖ్యాత గీత రచయిత జావేద్ అక్తర్ కూడా షమీకి మద్దతు పలికారు.

"షమీ సాహెబ్... మనం ఏం చేసినా తప్పుబట్టే  మూర్ఖుల మాటలను పట్టించుకోకండి... దుబాయ్ లోని క్రికెట్ స్టేడియంలో మండే ఎండలో మంచి నీరు తాగినా వారికి ఇబ్బందే... అలాంటి  వారిని అలా వదిలేయండి... అసలీ విషయం వారికి సంబంధించిందే కాదు... అందరినీ గర్వించేలా చేస్తున్న గ్రేట్ టీమిండియాలో మీరు కూడా ఒక సభ్యుడు. మీకు, యావత్ జట్టుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అంటూ జావేద్ అక్తర్ సోషల్ మీడియాలో స్పందించారు.
Mohammad Shami
Roza Row
Energy Drink
Javed Aktar
Team India
Ramadan
Champions Trophy 2025

More Telugu News