Chandrababu: మార్కాపురంను జిల్లా చేస్తాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu announces govt will declare Markapur as new district
  • మార్కాపురంలో చంద్రబాబు పర్యటన
  • మహిళా దినోత్సవ కార్యక్రమాలకు హాజరు
  • అనంతరం స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం 
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురంలో పర్యటించారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్కాపురం జిల్లా చేస్తామని వెల్లడించారు. మార్కాపురంను జిల్లా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నంద్యాలను జిల్లాగా చేసినా, మార్కాపురంను ప్రకాశం జిల్లాలోనే ఉంచారు. ఇవాళ చంద్రబాబు కొత్త  జిల్లాపై స్పష్టమైన హామీ ఇచ్చారు. 

ఇక పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తామని, కష్టపడిన వారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు నాయకుల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నానని చంద్రబాబు వెల్లడించారు. అన్ని ఎన్నికల్లో మనం గెలిస్తే కార్యకర్తలకు గౌరవం పెరుగుతుందని అన్నారు. ప్రతి ఎన్నికలోనూ గెలవడం ద్వారా రాష్ట్రంలో సుస్థిరపాలన వస్తుందని చెప్పారు. 

కార్యకర్తల శరీరంలోని ప్రతి రక్తపు బొట్టూ పసుపు రంగేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. నాయకులు వెళ్లిపోవచ్చేమో కానీ కార్యకర్తలు ఒక్క అడుగు కూడా అటూ ఇటూ వేయరని అన్నారు. కార్యకర్తల రుణం ఎలా తీర్చుకోవాలనే దానిపైనే ఆలోచిస్తున్నామని చెప్పారు. 

కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పినా నిర్వహించడంలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో మీటింగులు జరిపినా... కార్యకర్తలతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహిస్తేనే ఆప్యాయత కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. మిమ్మల్ని కళ్లెదుట చూసుకుంటే మాట్లాడుతుంటే అనుబంధం పెరుగుతుందని అన్నారు. 

క్షేత్రస్థాయిలో కొందరు టీడీపీ నేతలు వైసీపీ వాళ్లతో లాలూచీ పడినట్టు తనకు తెలిసిందని, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని హెచ్చరించారు. తాను ఈ మాట చెబితే... వైసీపీ వాళ్లు గింజుకుంటున్నారని... ఏం, మా వాళ్లు మీతో లాలూచీ పడాలా? అని ప్రశ్నించారు. ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము? అంటూ నిలదీశారు.
Chandrababu
Markapur
New District
TDP-JanaSena-BJP Alliance

More Telugu News