Champions Trophy 2025: నేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. న్యూజిలాండ్‌తో తలపడే భారత జట్టు ఇదే.. కోహ్లీ డౌటే!

India Likely Playing XI vs New Zealand Champions Trophy Final
  • దుబాయ్‌లో నేడు భారత్-కివీస్ ఫైనల్ మ్యాచ్
  • ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి టీమిండియా!
  • ఈసారి కూడా రిషభ్ పంత్ బెంచ్‌కే పరిమితం
  • వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తే కుల్దీప్ అవుట్
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. గత రెండు మ్యాచుల్లో భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. బలమైన కివీస్‌ను ఎదుర్కొనేందుకు ఈ మ్యాచ్‌లోనూ అదే జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

స్కిప్పర్ రోహిత్ శర్మ.. శుభమన్‌గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. విరాట్ కోహ్లీ మోకాలికి స్వల్ప గాయమైనప్పటికీ జట్టులో అతడి చోటుకు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చెప్పలేమని, ఏదైనా జరగొచ్చని అంటున్నారు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ వస్తాడు. దీనిని బట్టి చూస్తుంటే రిషభ్‌పంత్ మరోమారు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. మిడిలార్డర్‌లో దిగే వీరిలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. అయితే, వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో చోటివ్వాలనుకుంటే ఈ టోర్నీలో అంతగా రాణించని కుల్దీప్ యాదవ్‌కు ఉద్వాసన తప్పకపోవచ్చు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటిన వరుణ్ చక్రవర్తి స్థానానికి వచ్చిన ముప్పేమీ లేదు. ఇక జట్టులో ఉన్న ఒకే ఒక్క పేసర్ మహ్మద్ షమీ. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. 

ఫైనల్‌లో భారత జట్టు కూర్పు ఇలా ఉండొచ్చు
రోహిత్ శర్మ (కెప్టెన్) శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి. 
Champions Trophy 2025
Team India
Team New Zealand
Virat Kohli
Kuldeep Yadav
Washington Sundar

More Telugu News