Champions Trophy 2025: ఫైనల్ మ్యాచ్ పై 5 వేల కోట్ల బెట్టింగ్!

Rs 5000 Crore Bets Linked To Underworld Placed On India New Zealand Final
  • భారత జట్టే ఫేవరెట్ గా పందాలు
  • బుకీలకు అండర్ వరల్డ్ తో సంబంధాలు
  • ఐదుగురు బుకీలను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో భాగంగా మరికొద్ది గంటల్లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ లో జరగనున్న ఈ మ్యాచ్ పై భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఈ బెట్టింగ్ దందాకు సంబంధించి ఐదుగురు కీలక బుకీలను అరెస్టు చేశామని వివరించారు. ఇందులో కొందరికి అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన అండర్ వరల్డ్ గ్రూపు ‘డి కంపెనీ’ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పారు. ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టే ఫేవరెట్ అని, మ్యాచ్ పై ఏకంగా రూ.5 వేల కోట్ల బెట్టింగ్ జరిగిందని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో క్రైం బ్రాంచ్ పోలీసులు రెయిడ్స్ చేపట్టారు. బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలు ప్రవీణ్ కొచ్చర్, సంజయ్ కుమార్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ల్యాప్ ట్యాప్ లు, మొబైల్ ఫోన్లతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా.. ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ పైనా బెట్టింగ్ నిర్వహించినట్లు చెప్పారన్నారు. ఈ బెట్టింగ్ దందాను దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారని, ప్రతీ మ్యాచ్ కు తమకు రూ.40 వేల చొప్పున కమీషన్ అందుతుందని తెలిపారు. రెండేళ్లుగా నెలకు రూ.30 వేలు చెల్లించి ఓ ఇంటిని ప్రత్యేకంగా ఈ దందా కోసమే అద్దెకు తీసుకున్నట్లు ప్రవీణ్ చెప్పాడు. ఆన్ లైన్ లో, మొబైల్ ఫోన్ల ద్వారా ఆఫ్ లైన్ లోనూ పందాలు స్వీకరిస్తామని వివరించాడు. కాగా, వీరిద్దరితో పాటు వెస్ట్ ఢిల్లీకి చెందిన ఛోటూ బన్సాల్, మోతీనగర్ కు చెందిన వినయ్, మరొక బుకీని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
Champions Trophy 2025
Final Match
Betting
Dubai
Underworld
India New Zealand

More Telugu News