USA: పాకిస్థాన్ కు వెళ్లొద్దు.. అమెరికా ట్రావెల్ అడ్వైజరీ

USA Issues Do Not Travel Advisory For Pakistan Due To Terrorism
  • ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందని తన పౌరులకు హెచ్చరిక
  • ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాలకు అస్సలు వెళ్లొద్దని వార్నింగ్
  • ఆయా ప్రావిన్స్ లలో సడెన్ గా ఉగ్ర దాడులు జరగొచ్చని వెల్లడి
పాకిస్థాన్ లో ఉగ్ర దాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. ఉన్నట్టుండి దాడులు జరగొచ్చు. వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ అమెరికా తన పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లకు అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్ లలో ఎప్పుడు ఎక్కడ ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందనేది చెప్పలేమని, పౌరులను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని తెలిపింది. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాద కార్యకలాపాలతోపాటు సైనిక ఘర్షణలు జరిగే అవకాశముందని హెచ్చరించింది. పాకిస్థాన్‌కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. ఈమేరకు శుక్రవారం (అమెరికా కాలమానం) ఈ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇందులో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏరియాకు అస్సలు ప్రయాణించవద్దని లెవెల్ 4 హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల్లో మిలిటెంట్ గ్రూపులు దాడులు చేయొచ్చని, సరిహద్దులకు రెండువైపులా రెండు దేశాలు భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించాయని వివరించింది. పాక్ నుంచి భారత్ లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.
USA
Pakistan
Travel Advisory
Terrorism
Balochistan

More Telugu News