Sajjala Ramakrishna Reddy: ఒకే రోజున యువత పోరు... వైసీపీ ఆవిర్భావ వేడుకలు: పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సజ్జల

YSRCP Formation Day Sajjala calls upon party cadres
  • 'యువత పోరు'కు వైసీపీ పిలుపు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై నిరసన
  • నిరుద్యోగ భృతి హామీని నిలదీస్తూ ఆందోళన
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం
  • 12న వైసీపీ ఆవిర్భావ వేడుకలు
రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను ప్రస్తుత ప్రభుత్వం మోసం చేస్తోందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ నెల 12న ‘యువత పోరు’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే రోజున వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, ప్రతి గ్రామంలో పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. 

సుమారు రూ.3,900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉంటే, బడ్జెట్‌లో కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని విమర్శించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఐదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో పెట్టడం అమానుషమని అన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, వాటిలో ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయి తరగతులు కూడా ప్రారంభమయ్యాయని సజ్జల గుర్తు చేశారు. మిగిలిన వాటి నిర్మాణ పనులు పూర్తి చేసి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా, వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.

ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ యువతకు, విద్యార్థులకు అండగా నిలబడి ప్రభుత్వ విధానాలపై పోరాడుతుందని సజ్జల స్పష్టం చేశారు. ఈ ‘యువత పోరు’ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతో కలిసి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి వైసీపీ శ్రేణులు ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించి, కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని సూచించారు.

ఈ నెల 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉత్సాహంగా జరుపుకోవాలని, ప్రజల్లో పార్టీకి ఉన్న బలాన్ని చాటుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

Sajjala Ramakrishna Reddy
YSRCP
Jagan

More Telugu News