India: ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియా... ఫైనల్లో కివీస్ మటాష్

India clinches ICC Champions Trophy 2025 by beating New Zealand in the final
  • 4 వికెట్ల తేడాతో ఇండియా విన్
  • 252 పరుగుల టార్గెట్ ను 49 ఓవర్లలో కొట్టేసిన రోహిత్ సేన
  • రాణించిన హిట్ మ్యాన్... కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఇవాళ  దుబాయ్ లో న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. 

కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ రాణించిన వేళ... 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్ గా నిలిచింది. చివర్లో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం నుంచి మైదానంలోకి పరుగులు తీశారు. 

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువ చేయలేం. ఆ జట్టు సాధించింది 251 పరుగులే అయినప్పటికీ, ఆ స్కోరును కాపాడుకునేందుకు చివరి వరకు పట్టువిడవకుండా పోరాడింది. అయితే, భారత బ్యాట్స్ మెన్ పట్టుదల ముందు కివీస్ ఎత్తుగడలు పనిచేయలేదు. 

టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే... కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి ఇన్నింగ్స్ నడిపించాడు. హిట్ మ్యాన్ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 76 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 31 పరుగులు చేయగా... మాంచి ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు చేశాడు. 

అక్షర్ పటేల్ 29, కేఎల్ రాహుల్ 34 (నాటౌట్), జడేజా 9 (నాటౌట్) తలో చేయి వేసి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 2, మైకేల్ బ్రేస్వెల్ 2, కైల్ జేమీసన్ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంతేకాదు, టోర్నీలో ఒక్కసారి కూడా టాస్ గెలవకుండానే ఏకంగా టైటిల్ నెగ్గడం విశేషం.
India
ICC Champions Trophy 2025
Winner
New Zealand
Final
Dubai

More Telugu News