Raj Thackeray: కుంభమేళా నుంచి తీసుకువచ్చిన నీళ్లు తాగేందుకు నిరాకరించిన రాజ్ థాకరే

Raj Thackeray said he refused to drink water from Kumbh
  • కుంభమేళా నుంచి నీటిని తీసుకువచ్చిన ఎంఎన్ఎస్ పార్టీ నేత
  • ఆ నీటిని తాగాలని పార్టీ అధినేత రాజ్ థాకరేకు సూచన
  • ప్రజలు నీళ్లలో దిగి ఒళ్లు రుద్దుకోవడం చూశాక ఆ నీటిని ఎలా తాగుతామన్న థాకరే
గంగా నదిని ప్రక్షాళన చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ మహారాష్ట్ర  నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే విమర్శించారు. అందుకే, తన పార్టీ సభ్యుడు బాలా నందగావ్ కర్ కుంభమేళా నుంచి తీసుకువచ్చిన నీటిని తాగేందుకు తాను నిరాకరించానని థాకరే వెల్లడించారు. పింప్రి చించివాడ్ లో ఏర్పాటు చేసిన ఎంఎన్ఎస్ పార్టీ 19వ వ్యవస్థాపక దినోత్సవ సభలో రాజ్ థాకరే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కుంభమేళాకు వెళ్లిన ప్రజలు నీళ్లలో దిగి తమ ఒళ్లు రుద్దుకుంటూ స్నానాలు చేయడం సోషల్ మీడియాలో చూశాను. కుంభమేళాకు వెళ్లిన మా పార్టీ నేత నందగావ్ కర్ అక్కడి నీళ్లు కమండలంలో తీసుకువచ్చారు. ఆ నీటిని తాగమని నన్ను కోరారు. కానీ, అలాంటి నీటిని ఎవరు తాగుతారు? 

మనం గతంలో కొవిడ్ వంటి మహమ్మారి నుంచి బతికి బయటపడ్డాం. అప్పట్లో మాస్కులు ధరించడం తప్పనిసరిగా ఉండేది. కానీ అలాంటి పరిణామాల నుంచి కూడా మనం ఏమీ నేర్చుకోలేదు. మతపరమైన పుణ్యస్నానాల పేరిట జనాలు పెద్దఎత్తున గుమికూడారు. మతవిశ్వాసాలు అర్థవంతంగా ఉండాలే తప్ప, మూఢనమ్మకాల వెంట ప్రజలు నడవడం సరికాదు. ప్రజలు తప్పనిసరిగా ఆలోచించాలి" అని రాజ్ థాకరే పేర్కొన్నారు. 
Raj Thackeray
Kumbh Water
MNS
Maharashtra

More Telugu News