Revanth Reddy: కేసీఆర్ అలా చేసి ఉంటే ఏపీతో సమస్య వచ్చేది కాదు: రేవంత్ రెడ్డి

Revanth Reddy talks about conflicts with Andhra Pradesh
  • బీఆర్ఎస్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే సమస్య వచ్చి ఉండేది కాదన్న ముఖ్యమంత్రి
  • కేసీఆర్‌ను విమర్శించేందుకు ముఖ్యమంత్రి స్థాయి సరిపోదా? అని ప్రశ్న
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తెలియదన్న ముఖ్యమంత్రి
తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే, ప్రస్తుతం నీటి విషయమై ఆంధ్రప్రదేశ్‌తో సమస్యలు తలెత్తేవి కావని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కేసీఆర్‌ను గద్దె దించి తాము అధికారంలోకి వచ్చామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ను విమర్శించేందుకు ముఖ్యమంత్రి స్థాయి సరిపోదా అని ఆయన ప్రశ్నించారు.

మంద కృష్ణ మాదిగ అంటే తనకు గౌరవం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, పోటీ పరీక్షల ఫలితాలకు, రిజర్వేషన్లకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. మంద కృష్ణ మాదిగ బీజేపీ నాయకుడిలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడో విడుదలైన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అంశం వర్తించదని గుర్తించాలని సూచించారు. ఏదైనా చేయాలని చూస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆయన హెచ్చరించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని ముఖ్యమంత్రి అన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పరిమితమైన కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 39 సార్లు కాకుంటే 99 సార్లు ఢిల్లీకి వెళతామని, నిధుల కోసం వెళితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.
Revanth Reddy
Congress
KCR

More Telugu News