CM Chandrababu: నోరి దత్తాత్రేయుడు రచించిన ‘మంటాడ టు మ్యాన్‌హ్యాటన్’ గ్రంథాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు

cm chandrababu appoints dr dattatreyudu nori as advisor to govt for cancer diseases
  • డాక్టర్ నోరిని క్యాన్సర్‌ వ్యాధిపై ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటున్నామన్న సీఎం చంద్రబాబు
  • క్యాన్సర్‌ నివారణకు దత్తాత్రేయుడు సుధీర్ఘ సేవలందించారని ప్రశంస
  • డాక్టర్ నోరి తెలుగువాడిగా పుట్టడం గర్వకారణమన్న సీఎం   
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన 'మంటాడ టు మ్యాన్ హ్యాటన్' గ్రంథాన్ని విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమెస్కో విజయకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మారుమూల గ్రామమైన మంటాడలో పుట్టి ప్రపంచాన్నే మెప్పించి, ప్రపంచానికే సేవలందించిన దత్తాత్రేయుడు మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు.

ఆయన అదృష్టంతో పైకి రాలేదని, ప్రగాఢమైన సంకల్పంతో, అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్లారని పేర్కొన్నారు. దత్తాత్రేయుడి కుటుంబం వైద్య వృత్తిలో ఉంటూ సేవలందిస్తున్నారన్నారు. వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారని చెప్పారు. 50 ఏళ్ల పాటు క్యాన్సర్ వ్యాధికి సుదీర్ఘంగా సేవలందించారని కొనియాడారు. తమ అత్త బసవతారకం క్యాన్సర్ బారిన పడితే అమెరికాలో దత్తాత్రేయుడి వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి భార్యగా డబ్బులు పెట్టుకుని వైద్యం కోసం అమెరికా వచ్చానని, ఇలా ఎంతమందిని ఇక్కడికి తీసుకురాగలమని బసవతారకం నాడు అన్నారని, ప్రజలకు అవసరమైన క్యాన్సర్ ఆసుపత్రిని పెడితే బాగుంటుందని సూచించడంతో అప్పట్లో ఎన్టీఆర్ దత్తాత్రేయుడితో మాట్లాడి 7 ఎకరాల భూమిని హైదరాబాద్‌లో కేటాయించారన్నారు.

బసవతారకం చనిపోయాక ఆసుపత్రి పనులు నిలిచిపోగా, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు చేపట్టి బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రి బాగుందని, అమరావతిలో కూడా పెట్టమని దత్తాత్రేయుడు సంకల్పించారని, అమరావతిలో కూడా బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయించామని చెప్పారు. దత్తాత్రేయుడికి చికిత్స అందించడం వల్ల వచ్చిన అవార్డుల కంటే వైద్యం తీసుకున్న పేషెంట్ల నుంచి వచ్చిన అభినందనలే పెద్ద అవార్డుగా భావిస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

డాక్టర్ దత్తాత్రేయుడిని క్యాన్సర్‌పై ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, గద్దె రామ్మోహన్, కొణతాల రామకృష్ణ, ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. 

.
CM Chandrababu
Dr Dattatreyudu Nori
Govt Advisor
Cancer Diseases

More Telugu News