Urban Rope Way: దేశంలోనే తొలి అర్బన్ రోప్ వే... వారణాసిలో ట్రయల్ రన్ ప్రారంభం

Urban Rope Way trails begins in Varanasi for the first time in India
  • రూ.807 కోట్లతో రోప్ వే ప్రాజెక్టు
  • 3.75 కిలోమీటర్ల దూరం 15 నిమిషాల్లో ప్రయాణం
  • రోజుకు 16 గంటలు సేవలు అందించేలా డిజైన్
రోప్ వే అనగానే మనకు గుర్తొచ్చేది ఎక్కువగా హిల్ స్టేషన్లే. పర్వత ప్రాంతాల్లో సులువుగా రవాణా చేసేందుకు రోప్ వేలను ఉపయోగిస్తుంటారు. రోప్ వేల ఏర్పాటు, నిర్వహణ కష్టసాధ్యమైన పని. అదే జనావాస ప్రాంతాల్లో రోప్ వేలను ఏర్పాటు చేయడం అంటే కత్తిమీద సాము లాంటిది. తాజాగా, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నగరంలో అర్బన్ రోప్ వేలను ఏర్పాటు చేశారు. 

కొన్ని రోజుల కిందట ఈ రోప్ వే ట్రయల్ రన్ ను ప్రారంభించారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇది అమల్లోకి వస్తే వారణాసి నగరంలో రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనుంది. రద్దీని తగ్గించి, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచుతుందని అధికారులు తెలిపారు. 

దీనిపై నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎల్ఎంఎల్) ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజా మిశ్రా స్పందించారు. ఇది రూ.807 కోట్ల విలువైన ప్రాజెక్టు అని వెల్లడించారు. నగర రవాణాను మెరుగుపర్చడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గిస్తుందని తెలిపారు. ప్రస్తుతం కాంట్, రథ్ యాత్ర ప్రాంతాల మధ్యన 3.75 కిలోమీటర్ల దూరానికి ఒక గండోలా (రోప్ వే తొట్టె)ను తిప్పుతున్నామని వివరించారు. 15 నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రయల్ రన్ లో భాగంగా మరిన్ని గండోలాలు తిప్పుతామని వెల్లడించారు. 

ఇప్పటికే రోప్ వే ట్రాన్స్ పోర్టు కోసం కాంట్, విద్యాపీఠ్, రథ్ యాత్ర వద్ద స్టేషన్లు నిర్మించారు. ఎస్కలేటర్లు, లిఫ్టులు, వీల్ చెయిర్ ర్యాంపులు, రెస్ట్ రూములు, పార్కింగ్ ఏరియాలు, ఫుడ్ కోర్టులు, కేఫ్ లు, దుకాణాలు కూడా ఈ స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ రోప్ వే రవాణా వ్యవస్థలో భాగంగా 150 ట్రాలీ కార్లను వినియోగించనున్నారు. ఇవి నేలకు 45 నుంచి 50 మీటర్ల ఎత్తులో బలమైన కేబుల్స్ ఆధారంగా ప్రయాణించనున్నాయి. ఒక్కో ట్రాలీ కార్ లో 10 మంది ప్రయాణికులు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. రోజుకు 16 గంటల పాటు సేవలు అందించేలా ఈ రోప్ వే వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నారు.

.
Urban Rope Way
Varanasi
Trail Run
India

More Telugu News