USA: అమెరికా మద్యంపై 150% పన్ను: భారత్‌పై వైట్ హౌస్ విమర్శలు

White House Criticizes India Over 150percent Tax on American Liquor
  • భారతీయ పన్నులపై అమెరికా అసంతృప్తి
  • కెనడాను దోచుకుంటున్న దేశంగా అభివర్ణించిన ట్రంప్
  • సుంకాల తగ్గింపునకు ట్రంప్ ఒత్తిడి
అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న పన్నుల పట్ల వైట్ హౌస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.  భారత ప్రభుత్వం అమెరికన్ మద్యంపై 150 శాతం పన్ను విధిస్తుండటంపై తీవ్రంగా స్పందించింది. ఇది అమెరికా యొక్క వాణిజ్య ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర వాణిజ్య విధానాలను కోరుకుంటున్నారని, అమెరికాకు న్యాయమైన వాణిజ్య ఒప్పందాలు ఉండాలని ఆయన భావిస్తున్నారని తెలిపారు. కెనడా కూడా అమెరికాను దశాబ్దాలుగా మోసం చేస్తోందని, అధిక పన్నుల ద్వారా నష్టపరుస్తోందని ఆమె ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులపై కెనడా విధిస్తున్న దాదాపు 300 శాతం పన్నులను ఆమె ఉదాహరించారు. జపాన్ తమ బియ్యంపై 700 శాతం పన్ను విధిస్తోందని ఆమె గుర్తు చేశారు.

భారత్ వ్యవహరిస్తున్న తీరును ట్రంప్ తప్పుబట్టారు. భారతదేశంలో అమెరికన్ ఉత్పత్తులను అమ్మడం దాదాపు అసాధ్యమని, ఇందుకు అధిక పన్నులే కారణమని ఆయన అన్నారు. అయితే, ఎట్టకేలకు వారి విధానాలను ప్రశ్నించడం వల్ల, భారత్ తన పన్నులను తగ్గించడానికి అంగీకరించిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయని, వాటి నుండి డబ్బును తిరిగి రాబట్టడానికి తాము ప్రయత్నిస్తున్నామని ట్రంప్ అన్నారు. మెక్సికో, కెనడా, చైనా దేశాలపై ట్రంప్ పన్నులు విధించారు.
USA
TRUMP
Tariffs
India
Canada

More Telugu News