Nadendla Manohar: మే నెల నుంచి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు: మంత్రి నాదెండ్ల

Nadendla Manohar says govt implements mid day meal wit fine rice from May
  • ప్రతి ఇంటికి సంక్షేమం అమలు చేస్తామన్న మంత్రి
  • మే నుంచి తల్లి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం
  • మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టీకరణ 
  • చుక్కల భూములపై త్వరలో నిర్ణయం ఉంటుందని వెల్లడి
కాకినాడ రూరల్ నియోజకవర్గం పండూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమం చేరాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. 

మే నెల నుంచి పాఠశాలలు తెరిచే సమయానికి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. దీని కోసం 1 లక్ష 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.

ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని, మే నెలలో తల్లి వందనం పేరుతో రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 2028 నాటికి ఇంటింటికీ జలజీవన్ మిషన్ పథకం కింద కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చుక్కల భూముల సమస్యపై ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

గ్రామాల్లో పంచాయతీల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలకు అవసరమైన తాగునీరు, ఇతర అవసరాలను గ్రామపంచాయతీ ద్వారా తీర్చనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంపై ఎటువంటి అపోహలు వద్దని, ప్లాస్టిక్ బియ్యం ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. పౌష్టికాహారం అందించేందుకు ఫోర్టిఫైడ్ బియ్యం అందిస్తున్నామని, దీని కోసం ప్రభుత్వం ప్రతి కిలో బియ్యానికి రూ.46.10 ఖర్చు చేస్తోందని వివరించారు. 

పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు అందిస్తున్నామని, భవిష్యత్తులో రాగులు, ఇతర మిల్లెట్స్ కూడా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 


Nadendla Manohar
Mid Day Meal
Fine Rice
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News