Kiran Abbavaram: ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యేవారికి చేయూతనిస్తా: కిరణ్ అబ్బవరం

kiran abbavaram speech on dilruba pre release event
  • యువ కళాకారులను ప్రోత్సహిస్తానన్న కిరణ్ అబ్బవరం
  • ప్రతి ఏటా సినిమా అంటే పిచ్చి ఉండే పది మంది వ్యక్తులకు ఆర్ధిక సాయం చేస్తానని వెల్లడి
  • నా సినిమాలలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్మాతను కోరతానన్న కిరణ్
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం కీలక ప్రకటన చేశాడు. ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'దిల్‌రుబా' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ మాట్లాడాడు. 

తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉన్న పరిస్థితులు, నేడు యువ కళాకారుల పరిస్థితిని కిరణ్ వివరించాడు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌కు తాను వచ్చినప్పుడు తనతో పాటు 50 మంది ఉండేవాళ్లమని, అందరం కలిసి పని చేయాలని బావార్చి వద్ద కలిసే వాళ్లమని, కథలు చెప్పుకునే వాళ్లమని నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. అయితే రోజురోజుకు తమ సంఖ్య తగ్గి 50 నుంచి 10కి పడిపోయిందన్నాడు. ఇప్పుడయితే ఇద్దరు ముగ్గురు కూడా కనిపించడం లేదన్నాడు. 

అవకాశాలు రావడం, అవకాశం వచ్చిన వాళ్లు ఇక్కడే సెటిల్ అవ్వడం, అవకాశాలు రాకుండా మిగిలిపోయిన వాళ్లు ఇళ్లకు వెళ్లిపోతుండటం ఇందుకు కారణంగా పేర్కొన్నాడు. సినిమాలో నటన అంటే యువ కళాకారుల తల్లిదండ్రులకూ నమ్మకం ఉండటం లేదన్నాడు. అందుకే ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బంది పడుతున్న వారికి తోడు ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు కిరణ్ తెలిపాడు. తాను ఇప్పుడు చిన్న హీరోని అయినప్పటికీ తోచినంత సాయం చేస్తానని తెలిపాడు. 

ప్రతి ఏటా సినిమా అంటే పిచ్చి ఉండే పది మంది వ్యక్తులకు ఆర్ధిక సాయం చేయడంతో పాటు వారిని ఆదుకుంటానని తెలిపాడు. కొత్త వాళ్లను ఇండస్ట్రీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని, తన సినిమాలలోనూ కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్మాతలను అడుగుతానని వివరించాడు. తన కంటే టాలెంట్ ఉన్న వాళ్లు బయట చాలా మంది ఉన్నారని, తనకు అవకాశం వచ్చిందని, వాళ్లకు రేపు అవకాశం రావచ్చని కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 
Kiran Abbavaram
Dilruba Pre Release Event
Kiran Abbavaram Comments on Krishna Nagar

More Telugu News