Falcon 9 Rocket: బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్.. త్వరలోనే భూమ్మీదకు సునీతా విలియమ్స్

 Falcon 9 rocket with a Crew Dragon capsule successfully lift off
  • భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 4.33 గంటలకు ప్రయోగం
  • అంతరిక్ష నౌకలో నలుగురు వ్యోమగాములు
  • 19న సునీత, బచ్‌మోర్ భూమ్మీదకు వచ్చే అవకాశం
దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్  విల్‌మోర్ త్వరలోనే తిరిగి భూమ్మీద అడుగుపెట్టనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నాసా-స్పేస్ఎక్స్ చేపట్టిన ‘క్రూ-10’ మిషన్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 4.33 గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసింది.

నిజానికీ మిషన్‌ను 12వ తేదీనే చేపట్టాల్సి ఉండగా రాకెట్ గ్రౌండ్ సిస్టంలో సమస్య కారణంగా చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు. సమస్యను సరిచేసి తాజాగా ఇప్పుడు మళ్లీ చేపట్టారు. ఇక, డ్రాగన్ క్యాప్సూల్‌లో ఐఎస్ఎస్‌కు వెళ్లిన వ్యోమగాముల్లో అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. అంతరిక్ష నౌక ఐఎస్ఎస్‌తో నేడు డాకింగ్ అవుతుంది. దాంతోపాటు వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సునీత, బచ్ విల్‌మోర్ 19న భూమికి పయనమయ్యే అవకాశం ఉంది.

2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్‌లో సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు తిరిగి భూమికి రావాల్సి ఉండగా వారిని తీసుకెళ్లిన స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది ఒంటరిగానే భూమిని చేరుకుంది. ఆ తర్వాత కూడా పలుమార్లు వారిని భూమ్మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో 9 నెలల తర్వాత ఇప్పుడు నలుగురు వ్యోమగాములతో కూడిన స్టార్ లైనర్ ఐఎస్ఎస్‌కు పయనమైంది.
Falcon 9 Rocket
Nasa-SpaceX
Crew 10
Sunita Williams
Butch Wilmore

More Telugu News