Revanth Reddy: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు పెద్దన్న లాంటి వారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy says PM modi is the Big brother for all cms
  • ప్రధానిని కలవడంలో రాజకీయం ఏముంటుందన్న రేవంత్ రెడ్డి
  • ఢిల్లీ పర్యటన పేరుతో దుబారా చేయడం లేదని విమర్శ
  • కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాలని వ్యాఖ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్న లాంటి వారని, అలాంటి వ్యక్తిని తాను కలవడంలో రాజకీయం ఏముంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటన పేరుతో తాను దుబారా చేయడం లేదని వెల్లడించారు. ప్రధాని, కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాలని ఆయన వ్యాఖ్యానించారు.

కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోదీని కలిశానని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రధానిని గౌరవించే విజ్ఞత తమదని, కానీ రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు తాను కాంగ్రెస్ నేతను, మోదీ బీజేపీ నాయకుడు అని స్పష్టం చేశారు. అవసరమైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఢిల్లీకి తీసుకువెళతామని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నాలుగుసార్లు కలిశామని, నిర్మలా సీతారామన్, అమిత్ షాలను కూడా కలిసినట్లు వెల్లడించారు.

బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌ను నాశనం చేశారని ఆరోపించారు. చెరువులు, కుంటలు మాయం చేశారన్నారు. నగరంలోని అపార్టుమెంట్లకు తగిన డ్రైనేజీ వ్యవస్థ లేదని ఆయన అన్నారు. చెరువులను, కుంటలను పునరుద్ధరించాలని తాము ప్రయత్నిస్తుంటే అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నగరాన్ని నిర్మించాలని చూస్తే అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు.
Revanth Reddy
Narendra Modi
BJP
Congress

More Telugu News