Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు

Indian origin student Sudeeksha Konanki missing in Dominican Republic as her cloths found in beach
 
డొమినికన్ రిపబ్లిక్ దేశంలో వారం క్రితం అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి సంబంధించిన దుస్తులు స్థానిక పుంటా కానా బీచ్‌లో లభ్యమయ్యాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, సుదీక్ష కోనంకి ధరించినట్లు భావిస్తున్న దుస్తులు ఒక లాంజ్ కుర్చీ వద్ద గుర్తించారు. ఇసుకలో కూరుకుపోయిన దుస్తులు, వాటి పక్కనే లేత గోధుమ రంగు చెప్పులు ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి చూస్తే... సుదీక్ష ధరించిన దుస్తులను ఇవి పోలి ఉన్నాయి. నిఘా కెమెరాల్లో ఆమెతో చివరగా కనిపించిన వ్యక్తి జోషువా రీబ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. డొమినికన్ అధికారులు సుదీక్ష కోనంకి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

అమెరికాలోని వర్జీనియాకు చెందిన భారతీయ సంతతికి చెందిన 20 ఏళ్ల సుదీక్ష తన స్నేహితులతో కలిసి డొమినికన్ రిపబిప్లక్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. మార్చి 6న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అదృశ్యమైనట్లు ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలో సుదీక్ష, మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీలో సీనియర్ అయిన 22 ఏళ్ల జోషువా రీబ్‌తో కలిసి బీచ్ దగ్గర మార్చి 6 తెల్లవారుజామున 4.15 గంటలకు నడుస్తూ కనిపించింది. ఒకానొక సమయంలో వారిద్దరూ చేతులు పట్టుకుని ఉన్నారు. వారికి సమీపంలోనే సుదీక్ష ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. 

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆమె స్నేహితులు హోటల్‌కు తిరిగి వెళ్లగా... సుదీక్ష, రీబ్ మాత్రం బీచ్‌లో ఉండిపోయారు. రిసార్ట్‌లో విద్యుత్ అంతరాయం కారణంగా నిఘా కెమెరాలు పనిచేయకపోవడంతో అందుకు సంబంధించిన ఫుటేజ్ లభ్యం కాలేదు. 

అటు, విచారణలో రీబ్ పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. సుదీక్షను అలల నుంచి రక్షించానని, ఆమె స్పృహ కోల్పోయిందని తెలిపాడు. దీంతో రీబ్‌ను పోలీసులు నిఘాలో ఉంచారు. అతని కదలికలపై నిఘా పెట్టారు. అయితే రీబ్‌ను ఇంకా అనుమానితుడిగా పరిగణించలేదు. మరోవైపు రీబ్‌ను పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధించారని, అధికారిక అనువాదకుడు లేకుండానే విచారించారని రీబ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసులో న్యాయం జరగాలని వారు కోరుతున్నారు. 

సుదీక్ష అదృశ్యమై 8 రోజులు గడుస్తుండటంతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆమె ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. సుదీక్ష 5 అడుగుల 3 అంగుళాల పొడవు, నల్లటి జుట్టు, గోధుమ రంగు కళ్ళు కలిగి ఉంటుందని పోస్టర్లలో పేర్కొన్నారు.
Sudeekshs Konanki
Missing
Dominican Republic
Beach
Indian Origin
USA

More Telugu News