AR Rahman: నేనింకా రెహమాన్ భార్యనే... ఆడియో సందేశం వెలువరించిన సైరా బాను

Saira Banu releases an audio message after AR Rahman fall ill
  • అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన రెహమాన్
  • చికిత్స అనంతరం డిశ్చార్జి
  • స్పందించిన సైరా బాను 
  • తనను రెహమాన్ మాజీ భార్య అని పిలవొద్దని స్పష్టీకరణ
ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. 

ఇదిలా ఉండగా, తనను రెహమాన్ మాజీ భార్య అని పిలవొద్దని సైరా బాను కోరారు. రెహమాన్, తాను ఇంకా విడిపోలేదని, భార్యాభర్తలుగానే ఉన్నామని  వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఇవాళ ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. 

ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ఛాతి నొప్పి కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిసిందని, అల్లా దయతో ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. తాము అధికారికంగా విడాకులు తీసుకోలేదని, భార్యాభర్తలుగానే కొనసాగుతున్నామని, గత రెండు సంవత్సరాలుగా తాను ఆరోగ్యంగా లేనందున ఆయనకు ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదనే ఉద్దేశంతో దూరంగా ఉన్నామని ఆమె తెలిపారు. తన ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆయనతో ఉంటాయని, ఆయన కుటుంబ సభ్యులు ఆయనను బాగా చూసుకోవాలని కోరారు.

రెహమాన్ నిన్న లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు ఆయనకు డీహైడ్రేషన్ కారణంగా ఇలా జరిగిందని నిర్ధారించారని ఆయన ప్రతినిధి తెలిపారు. రంజాన్ మాసం కావడంతో ఉపవాసం ఉండటం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యారని వైద్యులు పేర్కొన్నారు.

గత సంవత్సరం రెహమాన్, సైరా బాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలిచారు. వీరు 29 సంవత్సరాలుగా వివాహ బంధంలో ఉన్నారు. వీరికి ముగ్గురు పిల్లలు - కుమారుడు ఏఆర్ అమీన్, కుమార్తెలు ఖతీజా రెహమాన్, రహీమా రెహమాన్ ఉన్నారు. విడాకుల ప్రకటన అనంతరం రెహమాన్ స్పందిస్తూ, విరిగిన హృదయాల భారాన్ని మోయడం చాలా బాధాకరమని అన్నారు. స్నేహితులు తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎక్స్ లో (ట్విట్టర్)లో ఆయన పెట్టిన పోస్ట్ లో, "మేము ముప్పై సంవత్సరాలు కలిసి ఉండాలని ఆశించాము, కానీ అన్ని విషయాలకు ఒక ముగింపు ఉంటుందని తెలుస్తోంది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా కంపించవచ్చు. ఈ విచ్ఛిన్నంలో, మేము అర్థం వెతుకుతున్నాము. ఈ కష్ట సమయంలో మా వ్యక్తిగత గోప్యతను గౌరవించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.
AR Rahman
Saira Banu
Wife
Divorce

More Telugu News