Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ

Minister Seethakka Verses MLA Prabhakar Reddy In Assembly
  • ఆ అవసరమే తమకు లేదన్న మంత్రి సీతక్క
  • వ్యక్తిగత కారణాలవల్లే ఆత్మహత్యాయత్నం చేశాడని వివరణ
  • అసెంబ్లీలో మంత్రి సీతక్క వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
బీసీ సంక్షేమ వసతి గృహాలలో వసతులు సరిగా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల తన నియోజకవర్గంలోని బీసీ హాస్టల్ లో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపారు. ఆ విద్యార్థి రెండు రోజులుగా కోమాలో ఉన్నాడని వివరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు రానీయకుండా తొక్కిపెట్టిందని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అయితే, ఈ ఆరోపణలను మంత్రి సీతక్క ఖండించారు. ఏ విషయాన్నీ తొక్కిపెట్టాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. సదరు విద్యార్థి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యాయత్నం చేశాడని, మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని వివరించారు.

నీలోఫర్ లో చేర్పించి విద్యార్థికి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క హితవు పలికారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు కేసీఆర్ పాలనలో హాస్టళ్ల నిర్వహణ బాగుండేదనే మాటే నిజమైతే.. కేసీఆర్ పదేళ్ల పాలనలో మొత్తం 114 మంది గురుకుల విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పాలని మంత్రి సీతక్క నిలదీశారు. దుబ్బాక హాస్టల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించి నివేదిక తెప్పించుకుని సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.
Seethakka
Telangana
Congress
BRS
Assembly Session
Student Suicides

More Telugu News