AP Cabinet: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లిన పవన్

Pawan Kalyan met CM Chandrababu after cabinet meeting
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
  • పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
  • పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు కేబినెట్ 
  • కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం
సీఎం చంద్రబాబు అద్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీ ముగిశాక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... సీఎం చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లారు. చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టీచర్ల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు కూడా నేటి మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 

చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆమోదం లభించింది. నంబూరులో వీవీఐటీయూ విద్యాసంస్థకు ప్రైవేట్ వర్సిటీ హోదా కల్పిస్తూ ఆమోదం తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. పలు సంస్థలకు భూకేటాయింపులకు కూడా నేటి కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. 

అటు, ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా సమర్పించిన నివేదికకు కూడా కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రాన్ని యూనిట్ గా వర్గీకరణ చేయాలని నివేదిక కమిషన్ ఇవ్వగా, జిల్లాను యూనిట్ గా తీసుకుని వర్గీకరణ చేయాలన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవాలని నిర్ణయించారు. 2026 జనాభా లెక్కలు వచ్చాక జిల్లాను యూనిట్ గా తీసుకుని వర్గీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్ కు పంపాలని నిర్ణయించారు. 

బుడగజంగాలు, మరో కులాన్ని ఎస్టీల్లో చేర్చేందుకు తీర్మానం చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చుతూ నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. పెనమలూరులోని తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్సార్ పేరు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.
AP Cabinet
Chandrababu
Pawan Kalyan
TDP-JanaSena-BJP Alliance

More Telugu News