Sunita Williams: త్వ‌ర‌లో భార‌త్‌కు రానున్న‌ సునీతా విలియ‌మ్స్‌.. వెల్ల‌డించిన ఆమె బంధువు!

Sunita Williams Will Visit India Soon Announced by Relative
  • 9 నెల‌ల సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత భూమికి చేరుకున్న భార‌త సంత‌తి వ్యోమ‌గామి 
  • సుర‌క్షితంగా పుడ‌మికి చేర‌డంతో భార‌త్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబ‌రాలు
  • ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన‌ ఆమె బంధువు ఫాల్గుణి పాండ్య
  • త్వ‌రలోనే సునీత భార‌త్‌కు వ‌స్తార‌ని.. తామంతా క‌లిసి వెకేష‌న్ ప్లాన్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డి
తొమ్మిది నెల‌ల పాటు అంత‌రిక్షంలో చిక్కుకుపోయిన భార‌త సంత‌తి వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్ ఎట్ట‌కేల‌కు పుడ‌మిని చేరుకున్నారు. ఆమెతో పాటు మ‌రో ముగ్గురితో భూమికి బ‌య‌ల్దేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగ‌న్ బుధ‌వారం తెల్ల‌వారుజామున 3.27 గంట‌లకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సుర‌క్షితంగా దిగింది. వారి రాక‌ను ప్ర‌పంచ‌మంతా ఊపిరి బిగ‌బ‌ట్టి చూసింది. వారు క్షేమంగా భూమిపైకి ల్యాండ్ కావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఇక సునీత సుర‌క్షితంగా పుడ‌మికి చేర‌డంతో భార‌త్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబ‌రాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె బంధువు ఒక‌రు మీడియాతో మాట్లాడారు. సునీతా విలియ‌మ్స్ త్వ‌ర‌లోనే భార‌త్‌కు వ‌స్తార‌ని ఆమె వెల్ల‌డించారు. 

తొమ్మిది నెల‌ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ అంత‌రిక్షం నుంచి సునీత క్షేమంగా భూమికి తిరిగిరావ‌డంతో గుజ‌రాత్ రాష్ట్రంలోని ఝూలాస‌న్‌లో ఆమె బంధువులు, స్థానికులు బాణ‌సంచా కాల్చి నృత్యాలు చేస్తూ సంబ‌రాలు చేసుకున్నారు. సునీత బంధువు ఫాల్గుణి పాండ్య గ్రామంలోని ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. 

ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... "సునీత కోసం తొమ్మిది నెల‌లుగా ఎదురుచూస్తున్నాం. అంతా సాఫీగా జ‌రిగినందుకు హ్యాపీగా ఉంది. ఆమె పుడమిపై దిగిన క్ష‌ణాలు అపురూపం. ఎలాంటి స‌వాళ్ల‌నైనా ఆమె ఎదుర్కోగ‌ల‌దు. మా అంద‌రికీ ఆమెనే ఆద‌ర్శం. ఇప్పుడంతా సునీత‌కు ఫ్యామిలీ టైమ్‌. త్వ‌ర‌లోనే ఆమె భార‌త్‌కు రానున్నారు. 

మేమంతా క‌లిసి వెకేష‌న్ ప్లాన్ చేస్తున్నాం. సునీత అంత‌రిక్షంలో ఉన్న‌ప్పుడు కూడా ఆమెతో మేము ట‌చ్‌లోనే ఉన్నాం. ఇటీవ‌ల నేను ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రిగిన కుంభ‌మేళాకు వెళ్లగా ఆ విశేషాల‌ను ఆమె రోద‌సి నుంచే అడిగి తెలుసుకున్నారు" అని ఫాల్గుణి పాండ్య మీడియాతో అన్నారు. 

కాగా, అంత‌కుముందు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా సునీతా విలియ‌మ్స్‌ను భార‌త్‌కు ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ప్ర‌ధాని ఆమెకు ఓ లేఖ రాశారు. "మీరు భూమికి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత మిమ్మ‌ల్ని భార‌త్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నాం. త‌న కుమార్తెల‌కు ఆతిథ్యం ఇవ్వ‌డం ప‌ట్ల భార‌త్ సంతోషంగా ఉంటుంది" అని మోదీ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.     
Sunita Williams
Indian-American Astronaut
SpaceX Crew Dragon
Return to Earth
India Visit
Family Time
Gujarat
Jhujhasan
Narendra Modi
Phalguni Pandya

More Telugu News