Hardik Pandya: హార్దిక్ పాండ్యా మానసికంగా చిత్రవధ అనుభవించాడు.. బయోపిక్ తీయొచ్చు: మహ్మద్ కైఫ్

Hardik Pandyas Comeback Story From Criticism to Triumph
  • ఐపీఎల్ గత సీజన్‌లో దారుణంగా విఫలమైన పాండ్యా
  • జట్టును నడిపించడంలో విఫలం
  • తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న ఆటగాడు
  • టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ఆటతీరుతో జట్టుకు విజయాలు అందించిన వైనం
  • కమ్ బ్యాక్ కోసం అతడు మానసిక క్షోభ అనుభవించాడన్న కైఫ్
గత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మానసికంగా చిత్రవధ అనుభవించాడని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. అడ్డంకులను ఎదుర్కొన్ని మళ్లీ అతడు గాడిన పడిన తీరుపై బయోపిక్ తీయొచ్చని తెలిపాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిరుగులేని విజయాలు అందించిన రోహిత్ శర్మను తప్పించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసి జట్టు పగ్గాలు అతడికి అప్పగించింది. అతడి కెప్టెన్సీలో జట్టు దారుణ పరాజయాలు చవిచూసింది. కెప్టెన్‌గా పాండ్యా కూడా రాణించలేకపోయారు. రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలు ఇవ్వడాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు అతడిని హేళన చేశారు. తిట్టిపోశారు.

ఫామ్ లేమితో బాధపడుతూ విమర్శలు మూటగట్టుకున్న పాండ్యా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్, తాజాగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఫామ్‌లోకి వచ్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. అడ్డంకులను, బాధలను ఎదుర్కొని మళ్లీ గాడిన పడిన పాండ్యాపై కైఫ్ ప్రశంసలు కురిపించాడు. 

పాండ్యా తన బాధల్ని మనసులోనే దాచుకుని ముందుకు సాగాడని, అదే అతడి పునరాగమన కథ అని తెలిపాడు. ఇదొక చెడ్డ ప్రయాణమని అన్నాడు. అభిమానులు అతడిని హేళన చేశారని, ప్రజలు అతడిని తిరస్కరించారని వివరించాడు. ఆటగాడిగా అవమానాలతో ముందుకు సాగడం బాధాకరమన్నాడు. ఒక ఆటగాడు దానిని ఎప్పటికీ మర్చిపోడని పేర్కొన్నాడు. ఆటగాడికి అది మానసిక హింసగా మారుతుందని కైఫ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. 

పాండ్యా మానసిక క్షోభ అనుభవించాడని, అలాగే, టీ20 ప్రపంచకప్‌లో ఆడి రాణించాడని కైఫ్ ప్రశంసించాడు. ఫైనల్‌లో హెన్రిక్ క్లాసెన్‌ను అవుట్ చేశాడని, చాంపియన్స్ ట్రోఫీలో ఆడం జంపాపై సిక్సర్లు కొట్టాడని గుర్తుచేశాడు. బ్యాట్‌తోను, బంతితోనూ చక్కని ఆటతీరు కనబరిచాడని కొనియాడాడు. సింహంలా పోరాడాడని ప్రశంసించాడు. అతడి బయోపిక్ తీయాలనుకుంటే మాత్రం గత ఏడు నెలలు ఒక ఎత్తు, అంతకుముందు ఐపీఎల్‌లో జరిగిన ఘటనలు మరో ఎత్తని అన్నాడు. తన బలాన్ని నమ్ముకుని జట్టు విజయంలో నిశ్శబ్దంగా తన వంతు పాత్ర పోషించాడని కైఫ్ ప్రశంసించాడు. 
Hardik Pandya
Mohammed Kaif
IPL
Mumbai Indians
T20 World Cup
ICC Champions Trophy
Cricket
Biopic
Mental Health
Captaincy

More Telugu News