Air India: లండన్ ఎయిర్‌పోర్టుకు నిలిచిన విద్యుత్... అన్ని విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా

Heathrow Airport Power Failure Causes Widespread Flight Disruptions
  • హీత్రూ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు రద్దు
  • ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు విమానాల దారి మళ్లింపు
  • విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదమే కారణం
  • ప్రయాణికులకు ఎయిర్ ఇండియా సూచనలు
  • సమాచారం కోసం ఎయిర్‌లైన్స్‌తో టచ్‌లో ఉండాలని సూచన
లండన్ లోని హీత్రూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుల్లో ఒకటి. అలాంటి వరల్డ్ క్లాస్ విమానాశ్రయంలో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక్కడి సబ్ స్టేషన్ లో విద్యుత్ వ్యవస్థలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో, ఎయిర్‌పోర్టుకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. దాంతో అనేక విమానయాన సంస్థలు లండన్ కు విమాన సర్వీసులు నిలిపివేశాయి. 

భారత దిగ్గజ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిరిండియా కూడా నేడు లండన్ హీత్రూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి తన కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. హిత్రూ నుంచి వచ్చే విమాన సర్వీసులు, ఇతర ప్రాంతాలను హీత్రూకువెళ్లే విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ఎయిరిండియా వివరించింది. 

లండన్ హీత్రో విమానాశ్రయంలో విద్యుత్ అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా 1,300 కంటే ఎక్కువ విమానాలపై ప్రభావం పడింది. అనేక విమానాలను యూరప్ లోని ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించారు.

ఇక, ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI129 తిరిగి ముంబైకి చేరుకుంటుంది, ఢిల్లీ నుండి బయలుదేరిన AI161 విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. మార్చి 21న లండన్ హీత్రూ నుంచి బయలుదేరే, హీత్రూకు వెళ్లాల్సిన అన్ని విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది, ఇందులో మార్నింగ్ ఫ్లయిట్ AI111 కూడా ఉంది. అయితే, లండన్ గాట్విక్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లే విమాన సర్వీసుల్లో ఎలాంటి మార్పు లేదని, ఆ ఎయిర్‌పోర్టుకు తమ విమానాలు యథావిధిగా కొనసాగుతాయని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

పశ్చిమ లండన్‌లోని హేస్‌లో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన హీత్రూ విమానాశ్రయాన్ని మూసివేశారు. మార్చి 21 తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో లండన్ ఫైర్ బ్రిగేడ్ నుండి పది ఫైర్ ఇంజన్లు, దాదాపు 70 మంది అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారని మీడియా పేర్కొంది.

ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లోని వేలాది ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ అంతరాయం కలిగింది. సుమారు 150 మందిని తరలించి, ప్రమాద స్థలానికి 200 మీటర్ల దూరం వరకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.

ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ల ప్రకారం, ఈ ఘటన కారణంగా 1,300 విమానాలు ప్రభావితమయ్యాయి. క్వాంటాస్ ఎయిర్‌వేస్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి ప్రధాన విమానయాన సంస్థలు తమ విమానాలను పారిస్, షానన్ వంటి ప్రత్యామ్నాయ యూరోపియన్ విమానాశ్రయాలకు దారి మళ్లించవలసి వచ్చింది.

విమానాశ్రయానికి రావొద్దని, విమానాల సమాచారం కోసం ఎయిర్‌లైన్స్‌తో టచ్‌లో ఉండాలని హీత్రో విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు సూచించారు. అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు.

గతంలో కూడా హీత్రూ విమానాశ్రయం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. 2010 డిసెంబర్‌లో భారీగా కురిసిన మంచు కారణంగా విమానాశ్రయం మూతపడటంతో వేలాది విమానాలు రద్దు అయ్యాయి. అలాగే, 2013 జూలైలో రన్‌వేపై బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం దగ్ధం కావడంతో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.

లండన్ గాట్విక్‌కు విమానాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నప్పటికీ, హీత్రూలో అంతరాయం కారణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఎదురు చూస్తున్నారు. విమాన సేవలను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై స్పష్టత లేదు.

ఎయిర్ ఇండియా కూడా కార్యకలాపాల పునరుద్ధరణ గురించి సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే తెలియజేస్తామని పేర్కొంది. విమానాల సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఎయిర్ ఇండియా అధికారిక సమాచార మార్గాలను గమనించాలని ప్రయాణికులకు సూచించింది.
Air India
London Heathrow Airport
Power Outage
Flight Cancellations
Air India Flight Cancellations
Heathrow Airport Power Failure
UK Power Outage
Airport disruptions
Transformer Fire

More Telugu News