YS Viveka Murder Case: తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానంద కూతురు సునీత పిటిషన్

Viveka daughter Suneetha files petition in Telangana High Court
తన తండ్రి హత్య కేసు సీబీఐ కోర్టులో రోజువారీగా విచారణ జరిగేలా ఆదేశించాలని పిటిషన్
నాలుగేళ్లుగా కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ పురోగతి ఏమీ లేదని పిటిషన్‌లో పేర్కొన్న సునీత
విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన కోర్టు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై తెలంగాణ హైకోర్టులో ఆయన కూతురు సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఆమె సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. సీబీఐ కోర్టులో తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇప్పటికే దాదాపు నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ పురోగతి ఏమీ లేదని, సునీత ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైకోర్టులో విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి హత్య జరిగిందని, విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఇప్పటికే రెండు ఛార్జీషీట్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోందని, దీనిని ఆరు నెలల్లో ముగించేలా కోర్టును ఆదేశించాలని కోరారు.

సీబీఐ అధికారులు హార్డ్ డిస్క్‌లను ప్రతివాదులకు ఇచ్చారని, అవి తెరుచుకోవడం లేదని, దీంతో పదిహేను నెలలుగా విచారణ ముందుకు సాగడం లేదని హైకోర్టుకు తెలిపారు. 

సునీత ప్రధానంగా సీబీఐ అధికారులతో పాటు తన తండ్రి హత్య కేసులో నిందితులుగా ఉన్నవారందరినీ ప్రతివాదులుగా చేర్చారు. ఈ అంశంపై విచారణ జరిపిన ప్రత్యేక ధర్మాసనం సీబీఐతో పాటు ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు వ్యక్తిగతంగా ఇచ్చేందుకు సునీత న్యాయవాదికి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
YS Viveka Murder Case
Suneetha
CBI
Telangana High Court

More Telugu News