Salah al-Bardawil: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కీలక రాజకీయ నేత హతం

Death of Hamas Leader Sparks Further Tensions in Middle East
  • హమాస్ రాజకీయ నాయకుడు సలాహ్ అల్-బర్దావిల్, ఆయన భార్య హతం
  • బందీలను విడిచిపెట్టకుంటే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని హెచ్చరిక
  • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాల్పులు
  • తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్‌కు హమాస్ హెచ్చరిక
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న కారణంతో హమాస్‌పై వరుస దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తన జోరును మరింత పెంచింది. గత మంగళవారం గాజాపై జరిపిన దాడిలో 400 మందికి పైగా మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక రాజకీయ నాయకుడు, అక్టోబర్ 7 నాటి ఊచకోత సూత్రధారి సలాహ్ అల్-బర్దావిల్ హతమయ్యాడు. ఈ విషయాన్ని హమాస్ ధ్రువీకరించింది.

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ గ్రూప్ రాజకీయ కార్యాలయంలో సభ్యుడిగా ఉన్న బర్దావిల్, ఆయన భార్య చనిపోయినట్టు పాలస్తీనా మీడియా తొలుత వెల్లడించింది. ఆ తర్వాత హమాస్ మీడియా సలహాదారు తాహెర్ అల్ నోనో కూడా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. బర్దావిల్, ఆయన భార్య వారి స్థావరంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో మరణించినట్టు పేర్కొన్నారు.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన తొలి దశ కాల్పుల విరమణ ఉల్లంఘనకు గురైందంటూ ఇజ్రాయెల్ మళ్లీ కాల్పులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో గత మంగళవారం గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 400 మందికి పైగా మరణించారు. మరెంతోమంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.

కాల్పుల విరమణ ఒప్పందం మార్పులను హమాస్ తిరస్కరించడంతోనే దాడులకు ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల తెలిపారు. కాగా, ఇజ్రాయెల్ దాడులను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా, గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 85 మంది మృతి చెందారు. బందీలను విడిచిపెట్టకుంటే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ రక్షణమంత్రి కాట్జ్ హమాస్‌ను హెచ్చరించారు.
Salah al-Bardawil
Hamas
Israel
Gaza
Palestine
Political Violence
Military Conflict
Middle East Conflict
Netanyahu
Katz

More Telugu News