Nitish Kumar: నితీశ్ కుమార్ మానసికంగా అన్ ఫిట్: ప్రశాంత్ కిశోర్ విమర్శలు

Prashant Kishor Slams Nitish Kumars Leadership and Mental State
  • నితీశ్ కుమార్ మానసిక స్థితిపై ప్రశాంత్ కిశోర్ సందేహాలు 
  • రాష్ట్ర వ్యవహారాలపై అవగాహన లేదని విమర్శలు
  • పాలనపై నియంత్రణ కోల్పోయారని వెల్లడి
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇటీవల ఓ కార్యక్రమంలో జాతీయ గీతాలాపన జరుగుతుండగా, పక్కనున్న వ్యక్తితో పరాచికాలు ఆడడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జాతీయ గీతాన్ని నితీశ్ కుమార్ అవమానించారంటూ రాజకీయ విమర్శకులు ధ్వజమెత్తారు. ఈ క్రమంలో, మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మానసిక పరిస్థితిపై సందేహాలు వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ మానసికంగా అన్ ఫిట్ గా కనిపిస్తున్నారని, అటు శారీరకంగానూ అలసిపోయి పాలనా నియంత్రణ కోల్పోయారని వివరించారు. 

"నితీశ్ కుమార్ ఆరోగ్యం గురించి మొదట మాట్లాడింది ఆయన మిత్రపక్ష నేత సుశీల్ కుమార్ మోదీ. అప్పటి నుంచి చాలా మంది బీహార్ మంత్రులు ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడారు. నేను జనవరి వరకు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ బీపీఎస్సీ నిరసనల సమయంలో నితీశ్ కుమార్ మానసిక స్థితి క్షీణించిందని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదని నేను గ్రహించాను" అని ప్రశాంత్ కిశోర్ వివరించారు. 

జాతీయ గీతం ఆలపిస్తుండగా నితీశ్ కుమార్ తన ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్న వీడియో వైరల్ కావడంతో ఈ విమర్శలు ఊపందుకున్నాయి. జాతీయ గీతాన్ని అవమానించారంటూ ప్రతిపక్ష నేతలు నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నితీశ్ కుమార్ తన మంత్రి మండలిలోని మంత్రుల పేర్లను చెప్పలేరని, ఆయన మానసికంగా దృఢంగా లేరని ప్రశాంత్ కిశోర్ అన్నారు. 

"నితీశ్ కుమార్ రాజీనామా చేయాలి. ప్రధాని, హోంమంత్రికి నితీశ్ కుమార్ మానసికంగా సరిగా లేరన్న విషయం తెలియకపోవవచ్చు. నితీశ్ పరిస్థితిని వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత బీజేపీ వహించాలి" అని ఆయన అన్నారు. 

నితీశ్ కుమార్ నాయకత్వంపై ప్రశాంత్ కిశోర్ గత కొన్ని వారాలుగా గళం విప్పుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జేడీ(యూ)ని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నితీశ్ కుమార్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ అధికారాన్ని అనుభవిస్తోందని, ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోపు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసేందుకే మంత్రివర్గ విస్తరణ జరిగిందని ఆయన ఆరోపించారు. 

అటు, నితీశ్ కుమార్ ప్రవర్తనను ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ఖండించారు. "జాతీయ గీతాన్ని అవమానించడాన్ని భారతదేశం సహించదు" అని అన్నారు. నితీశ్ కుమార్ నాయకత్వం క్షీణిస్తోందని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ రుజువులు అవసరం లేదని ఆయన ప్రశ్నించారు. 

కాగా, నితీశ్ కుమార్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన కుమారుడు నిశాంత్, జేడీ(యూ) నేతలు కొట్టిపారేశారు. నితీశ్ కుమార్ నూటికి నూరు శాతం ఆరోగ్యంగా ఉన్నారని, మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేయగలరని నిశాంత్ పేర్కొన్నారు.
Nitish Kumar
Prashant Kishor
Bihar Chief Minister
National Anthem
Political Controversy
Mental Fitness
JD(U)
Lalu Prasad Yadav
Jan Suraj Party
BJP

More Telugu News