Amit Gupta: ఖతార్ లో టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్

Tech Mahindra Employee Arrested in Qatar
  • ఖతార్ లో భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్టు
  • అరెస్ట్ పై స్పందించిన స్పందించిన టెక్ మహీంద్రా
  • సాయం కోసం వడోదర ఎంపీ హేమాంగ్ జోషిని సంప్రదించిన బాధితుడి తల్లి
  • గుప్తాను విడిపించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామన్న భారత విదేశాంగ శాఖ 
ఖతార్‌లో టెక్ మహీంద్రా సీనియర్ ఉద్యోగి అమిత్ గుప్తా అరెస్టయ్యారు. గుజరాత్‌కు చెందిన ఆయనను డేటా చౌర్యం కేసులో అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమిత్ గుప్తా అరెస్టుపై టెక్ మహీంద్రా గ్రూప్ స్పందించింది. తమ ఉద్యోగి కుటుంబానికి అండగా ఉంటామని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఆయనను విడిపించడానికి రెండు దేశాల అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.

ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయంపై స్పందిస్తూ, అమిత్ గుప్తాను విడిపించడానికి అక్కడి అధికారులతో చర్చిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ కేసుకి అసలు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.

దీనిపై అమిత్ గుప్తా తల్లి మాట్లాడుతూ, తన కుమారుడు నిర్దోషి అని, అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. సంస్థలో ఎవరైనా తప్పు చేసి ఉంటే, ఖతార్ - కువైట్ రీజియన్ హెడ్‌గా ఉన్నందున తన కుమారుడిని అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా తమ కుమారుడు తమతో మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి అతని స్నేహితులకు కాల్ చేయగా, విషయం తెలిసిందని తెలిపారు.

జనవరి 1న ఖతార్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మూడు నెలలుగా దోహాలో బంధించి ఉంచారని ఆమె తెలిపింది. దీనిపై సాయం కోసం వడోదర ఎంపీ హేమాంగ్ జోషిని కలిసి విషయం తెలియజేయగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపింది. మరోవైపు, భారత విదేశాంగ అధికారులు మాట్లాడుతూ గుప్తా అరెస్టుపై ఖతార్ విదేశాంగ శాఖతో చర్చలు జరుపుతున్నామని, ఆయనను విడిపించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 
Amit Gupta
Tech Mahindra
Qatar
Arrest
Data theft
India
Indian Embassy
Gujarat
Hemang Joshi
Doha

More Telugu News