10th Paper Leak: పేపర్ లీక్ లో నా తప్పేమీ లేదు.. కన్నీటి పర్యంతమవుతున్న విద్యార్థిని

Nalgonda 10th Class Exam Paper Leak Student in Tears Claims Innocence
  • నల్గొండ జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం
  • రాయితో కొడతానని బెదిరించి పేపర్ చూపించమన్నారని విద్యార్థిని వెల్లడి
  • విద్యార్థిని డిబార్, అధికారులపై సస్పెన్షన్ వేటు
నల్గొండ జిల్లా నకిరేకల్ లో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఓ విద్యార్థినిని డిబార్ చేసిన అధికారులు.. ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ ను విధుల నుంచి తప్పించారు. అయితే, పేపర్ లీక్ ఘటనలో తన తప్పేమీలేదని బాధిత విద్యార్థిని వాపోయింది. పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన కూర్చుని సమాధానాలు రాస్తుండగా ఇద్దరు యువకులు తనను బెదిరించారని ఆరోపించింది. ప్రశ్నాపత్రం చూపించకపోతే రాయితో కొడతామనడంతో తాను భయపడ్డానని, ఏంచేయాలో తోచక పేపర్ చూపించానని చెప్పింది. పేపర్ ను ఫొటో తీసుకుని యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించింది.

ఆ యువకులు ఎవరో కూడా తనకు తెలియదని, ఇందులో తన తప్పేమీ లేదని తెలిపింది. పరీక్ష రాయడానికి తనను అనుమతించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. కాగా, శుక్రవారం నకిరేకల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో ప్రశ్నాపత్రం లీక్ అయింది. గోడ దూకి పరీక్షాకేంద్రంలోకి ప్రవేశించిన కొంతమంది వ్యక్తులు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసుకుని వెళ్లారు. ఆపై జవాబులు వెతికి, జిరాక్స్ తీయించి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. దీనిపై ఎంఈవో ఫిర్యాదు చేయగా.. పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేసి, ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
10th Paper Leak
Nalgonda
Narketpally
Student
Threatened
Police Case
Chief Superintendent
Departmental Officer
Telangana

More Telugu News