Nadeendla Manohar: వినియోగదారుడే రాజు... ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar Inaugurates Additional Consumer Commission Bench in Vijayawada
  • విజయవాడలో వినియోగదారుల కమిషన్ అదనపు బెంచ్ ప్రారంభం
  • నాణ్యత లేని వస్తువులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల హెచ్చరిక
  • వినియోగదారుల హక్కులపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
  • వినియోగదారుల కేసుల పరిష్కారంలో ఏపీ అగ్రగామిగా ఉందన్న నాదెండ్ల
వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వినియోగదారులే రాజులని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. విజయవాడ నగర పౌర న్యాయస్థాన సముదాయంలో వినియోగదారుల కమిషన్ రెండవ అదనపు బెంచ్ ను మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాణ్యత లేని వస్తువులు, గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అదనపు బెంచ్ విజయవాడలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. వినియోగదారులకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వారి హక్కులపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగదారుల ఫోరం కేసుల పరిష్కారంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,33,736 వినియోగదారుల కేసులు నమోదయ్యాయని, వాటిలో చాలా వరకు పరిష్కరించామని మంత్రి తెలిపారు. జిల్లా వినియోగదారుల ఫోరంలో రూ. 50 లక్షల వరకు విలువైన కేసులను, రాష్ట్ర ఫోరంలో రూ. 2 కోట్ల వరకు విలువైన కేసులను నమోదు చేసుకోవచ్చని ఆయన వివరించారు. 

రాష్ట్రంలో తొలిసారిగా పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ ప్రచారం నిర్వహిస్తామని, దీని ద్వారా వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. గతంలో మచిలీపట్నం వెళ్లాలంటే వినియోగదారులు ఇబ్బంది పడేవారని, ఇప్పుడు విజయవాడలోనే అదనపు బెంచ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్, అదనపు బెంచ్ ఫోరం ఛైర్మన్ సీహెచ్ కిశోర్, సభ్యురాలు కె. శశికళ, బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరిగల శివరామ ప్రసాద్, అధ్యక్షులు కె. చంద్రమౌళి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సీహెచ్. అజయ్ కుమార్, బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సోము కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Nadeendla Manohar
Andhra Pradesh
Consumer Rights
Consumer Protection
Vijayawada
Consumer Forum
Digital Awareness Campaign
Sourav Gour
CH Kishore

More Telugu News