YS Avinash Reddy: వివేకా హత్య కేసును అవినాశ్ రెడ్డి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

AP Govt Accuses Avinash Reddy in Additional Affidavit in Viveka Murder Case
  • రాంసింగ్, సునీత, ఆమె భర్తను ఇరికించే ప్రయత్నం చేశారన్న ఏపీ ప్రభుత్వం
  • తనను అవినాశ్ బెదరించారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజు అంగీకరించారని వెల్లడి
  • రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, ఏఎస్ఐజీ రామకృష్ణారెడ్డి కేసు మొత్తాన్ని నడిపించారన్న ప్రభుత్వం
వైఎస్ వివేకా హత్య కేసును వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. 

సీబీఐ అధికారి రాంసింగ్, వివేకా కూతురు సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డిపై కేసులు నమోదు చేశారని... కేసులో వీరిని ఇరికించేందుకు చూశారని అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది. ఇదంతా అవినాశ్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరిగిందని తెలిపింది. కేసును తారుమారు చేసేందుకు కుట్ర చేశారని చెప్పింది. 

రాంసింగ్ పై కేసు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి.రాజు కేసును విచారించలేదని తెలిపింది. తనను అవినాశ్ బెదిరించినట్టు రాజు అంగీకరించారని చెప్పింది. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, ఏఎస్ఐజీ రామకృష్ణారెడ్డిలే ఈ కేసు మొత్తాన్ని నడిపించారని తెలిపింది. సాక్షులను విచారించినట్టు దొంగ వాంగ్మూలాలు పుట్టించడం, ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం ఇలా అన్నీ వీరే చేశారని చెప్పింది.

వివేకా పీఏ కృష్ణారెడ్డిని రాంసింగ్ ఎప్పుడూ విచారించలేదని... తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అవినాశ్, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని కృష్ణారెడ్డి చెప్పిన దానిలో నిజం లేదని తెలిపింది. ఏఎస్ఐజీ రామకృష్ణారెడ్డి నివాసంలో తతంగం నడిపారని... కేవలం 12 రోజుల్లోనే కట్టు కథలు అల్లి రాంసింగ్, సునీత, నర్రెడ్డిలపై కేసులు నమోదు చేశారని చెప్పింది. తన ఫిర్యాదును బలపరిచే ఒక్క ఆధారాన్ని కూడా కృష్ణారెడ్డి సమర్పించలేకపోయారని తెలిపింది. 

చాలా మంది సాక్షులు తాము స్టేట్మెంట్ ఇవ్వనేలేదని విచారణలో తెలిపారని అఫిడవిట్  లో పేర్కొంది. కేసు డైరీలోని పత్రాలపై సంతకం చేయడానికి విచారణాధికారి జి.రాజు నిరాకరించారని... దీంతో, ఆయనను అవినాశ్ ఇంటికి తీసుకెళ్లి బెదిరించారని తెలిపింది. వివేకా హత్య కేసు నుంచి విముక్తి పొందేందుకు అవినాశ్ కుట్ర పన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొంది.
YS Avinash Reddy
YS Viveka Murder Case
Supreme Court
AP Government Affidavit
CBI Officer Ram Singh
Sunitha Viveka
Narendra Reddy
G. Raju
K. Rajasekhara Reddy
Ramkrishna Reddy

More Telugu News