Rohit Sharma: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా మళ్లీ అతడే!

Rohit Sharma to Captain Team India in England Test Series
  • రోహిత్ శర్మకే మళ్లీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయం
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఓటమి
  • చాంపియన్స్ ట్రోఫీ విజయం నేపథ్యంలో రోహిత్‌కే పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయం
  • ఐదు టెస్టుల సిరీస్ కోసం 45 రోజులపాటు ఇంగ్లండ్‌తో పర్యటించనున్న భారత జట్టు
  • జూన్ 20న హెడింగ్లీలో తొలి టెస్టు ప్రారంభం
ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు ఘోరంగా పరాజయం పాలైంది. అయినప్పటికీ అతడికే పగ్గాలు అప్పగించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్టు తెలిసింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డాడు. మూడు మ్యాచుల్లోనూ కలిపి 31 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు, సిడ్నీలో జరిగిన చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు కూడా. అయినప్పటికీ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించినట్టు సమాచారం. రోహిత్ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ముగిసే చివరి వారంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో అప్పటికి అందుబాటులో ఉండే ఆటగాళ్లు ఎవరన్న దానిపై స్పష్టత వస్తుంది. దీంతో ఐపీఎల్ చివరి వారంలో జట్టును ప్రకటించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు సమాచారం. మే-జూన్‌లో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ‘లయన్స్’తో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగుతాయి. భారత-ఏ జట్టుతో జరిగే ఈ మ్యాచుల్లో కొందరు సీనియర్ జట్టు ఆటగాళ్లు పాల్గొంటారని కూడా తెలుస్తోంది.

ఐదు టెస్టుల సిరీస్‌ కోసం భారత జట్టు 45 రోజులపాటు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. జూన్ 20న హెడింగ్లీలో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. అంతకుముందు మే 30న కాంటెర్‌బరీలోని సెయింట్ లారెన్స్‌లో తొలి నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుంది. జూన్ 6న నార్తాంప్టన్‌లో రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Rohit Sharma
Team India
England Test Series
BCCI
India vs England
Test Cricket
Cricket
IPL
India Tour of England
Lions Matches

More Telugu News