Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్

Revanth Reddy vs KTR War of Words over Kaleshwaram Project
  • రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న కేటీఆర్
  • కాళేశ్వరంను కూలేశ్వరమని మంత్రులు అనడం సరికాదని వ్యాఖ్య
  • గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే నీటిని ఇవ్వవచ్చన్న రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును 'కూలేశ్వరం' అంటూ మంత్రులు మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆలోచన లేకుండా భారీ ప్రాజెక్టును 'కూలేశ్వరం' అని సంబోధించవద్దని కేటీఆర్ హితవు పలికారు. కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్న ముఖ్యమంత్రే, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‍‌కు నీరు తెస్తానని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, బస్వాపూర్ ప్రాజెక్టులు కూడా ఉండవని ఆయన స్పష్టం చేశారు.

రైతులను పట్టించుకోవడం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా గోదావరి జలాలను వినియోగించే అవకాశం ఉందని ఆయన తేల్చి చెప్పారు. కమీషన్లు, ఫామ్ హౌస్‌ల కోసమే రీడిజైన్ల పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన ఆరోపించారు.

కాళేశ్వరం పేరుతో ఎవరెన్ని అక్రమాలు చేశారో నిరూపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇంకా ఎంత కాలం అబద్ధాలు చెబుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో నిర్మించిన ప్రాజెక్టులతోనే సాగునీరు అందించవచ్చని, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు అవసరం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఈ ప్రాజెక్టులపై నిజనిర్ధారణ కమిటీ వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై ఏకసభ్య కమిషన్ విచారణ జరుపుతోందని తెలిపారు. ఈ కమిషన్ ఇచ్చే నివేదికను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల ముందు ఉంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Revanth Reddy
KTR
Kaleshwaram Project
Telangana Politics
Irrigation Project
Farmers

More Telugu News