Earthquake: మయన్మార్‌, బ్యాంకాక్‌ల‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిన భ‌వ‌నాలు.. వైర‌ల్ వీడియో

Massive Earthquake Strikes Myanmar and Bangkok Buildings Collapse
  • 7.7 తీవ్రతతో భూకంపం 
  • భ‌యాందోళ‌న‌తో ఇళ్లు, కార్యాల‌యాల నుంచి బ‌య‌టికి ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు
  • ఒళ్లు గ‌గుర్పొడిచే వీడియోలు నెట్టింట వైర‌ల్
శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్క‌సారిగా భారీ ప్ర‌కంప‌న‌లు రావ‌డంతో భారీ భ‌వ‌నాలు పేక మేడ‌ల్లా కుప్ప‌కూలాయి. ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌తో ఇళ్లు, కార్యాల‌యాల నుంచి బ‌య‌టికి ప‌రుగులు తీశారు. ఇందుకు సంబంధించిన ఒళ్లు గ‌గుర్పొడిచే వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

ఇక భూకంప కేంద్రం సాగింగ్ నగరానికి వాయువ్యంగా 16 కిలోమీట‌ర్ల‌ దూరంలో 10 కిలోమీట‌ర్ల‌ లోతులో ఉందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని నివేదికలు పేర్కొన్నాయి.

ఇక ఈ భూకంపం కార‌ణంగా పొరుగున ఉన్న థాయ్‌లాండ్ రాజ‌ధాని బ్యాంకాక్‌లో తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్క‌డ‌ కొన్ని మెట్రో, ఇత‌ర‌ రైలు సేవలు నిలిపివేశారు. అలాగే చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయని బీజింగ్ భూకంప సంస్థ తెలిపింది.

థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా పరిస్థితిని సమీక్షించడానికి ఎమ‌ర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. యునాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతను నమోదు చేసిందని చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ వెల్ల‌డించింది.
Earthquake
Myanmar Earthquake
Bangkok Earthquake
7.7 Magnitude Earthquake
Strong Earthquake
Viral Videos
Building Collapse
Phaytoongthan Shinawatra
Thailand Metro Services
Yunnan Province Earthquake
US Geological Survey

More Telugu News