Satyakumar Yadav: కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ: రూ.259 కోట్ల అదనపు నిధులకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ వినతి

Satyakumar Yadav Meets Nirmala Sitharaman for Additional Funds
  • కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ భేటీ 
  • ప‌ర్యాట‌క అభివృద్ధి, క్యాన్స‌ర్ చికిత్స‌ల విష‌యంలో అద‌న‌పు కేంద్ర నిధులకు వినతి
  • ఎన్‌హెచ్‌ఎం కింద ఏపీకి రూ.109 కోట్లు విడుద‌ల చేయాల‌ని వినతి
జాతీయ ఆరోగ్య మిషన్, ఇతర పథకాల కింద రాష్ట్రానికి అదనంగా రూ.259 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో శుక్రవారం ఆయన సమావేశమై ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద పునఃకేటాయింపులు జరిపే తరుణంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకువచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూ.800 కోట్ల మేర పునఃకేటాయింపుల కింద అదనపు నిధులను కోరింది. వీటిలో ఎన్‌హెచ్‌ఎం కింద రాష్ట్రానికి రూ.109 కోట్లు విడుదల చేయాలని కేంద్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రులను కోరారు.

పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద రాష్ట్రానికి మరో రూ.150 కోట్లు విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. కేంద్ర టూరిజం, న్యాయ, అణుశక్తి శాఖ మంత్రులతో కూడా మంత్రి సత్యకుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు విషయాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, క్యాన్సర్ చికిత్సల విషయంలో అదనపు కేంద్ర సాయాన్ని మంత్రి సత్యకుమార్ కోరారు. 
Satyakumar Yadav
Nirmala Sitharaman
Andhra Pradesh
Central Funds
National Health Mission
NHM
Additional Funds
Performance Incentive
Tourism Development
Cancer Treatment

More Telugu News