Revanth Reddy: అభివృద్ధి అన్నప్పుడు అడ్డంకులు రావడం సహజమే: సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddys Ugadi Speech Highlights Record Paddy Production
  • హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఉగాది వేడుకలు
  • హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి పండిందని వెల్లడి
  • పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటన
హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఈ ఏడాది ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని భావిస్తున్నానని తెలిపారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి అన్నప్పుడు అడ్డంకులు రావడం సహజమేనని పేర్కొన్నారు. 

ఇటీవల రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది షడ్రుచుల కలయికగా ఉందని అభివర్ణించారు. బడ్జెట్ లో విద్య, వైద్య ఆరోగ్య, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని, అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఉద్ఘాటించారు. 

తాము నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ దేశంలోని కొత్త నగరాలకు మోడల్ సిటీగా మారుతుందని అన్నారు. 

ఇక, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి పండిందని, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇంత వరి పండలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. రేషన్ లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, మన రైతులు పండించిన పంటను పేదలకు పంచబోతున్నామని చెప్పారు.
Revanth Reddy
Telangana CM
Telangana Budget
Paddy Production in Telangana
Future City Telangana
Telangana Development
Bhatti Vikramarka
Vishavasu Nama Ugadi
Rice Distribution
Andhra Pradesh

More Telugu News