HCU: హైదరాబాద్ హెచ్‌సీయూ వద్ద నేడు కూడా ఉద్రిక్తత

HCU Students Clash with Police Amidst Land Auction Protest
  • హెచ్‌సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన
  • చెట్లు తొలగింపుతో మరింత ఉద్రిక్తత
  • నిరసనకారుల అరెస్టులను ఖండించిన ఎస్ఎఫ్ఐ
  • హెచ్‌సీయూ భూములు వర్సిటీకే వినియోగించాలని విద్యార్థుల విజ్ఞప్తి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపుదాల్చుతున్నాయి. వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిన్నటి నుంచి నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇవాళ విశ్వవిద్యాలయం ఆవరణలో చెట్లను తొలగించడానికి ప్రభుత్వం పూనుకోవడంతో వివాదం మరింత ముదిరింది. 

నేడు కూడా హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. చెట్లను తొలగించేందుకు అధికారులు తీసుకువచ్చిన జేసీబీలను విద్యార్థులు అడ్డుకున్నారు.

నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల అరెస్టులను తెలంగాణ ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విద్యార్థులను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. 

యూనివర్సిటీకి చెందిన సుమారు 500 ఎకరాల భూమిని గత 50 ఏళ్లలో వివిధ కారణాలతో ప్రభుత్వం వెనక్కి తీసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొదట్లో 2,300 ఎకరాలలో హెచ్‌సీయూ ఉండగా, ప్రస్తుతం యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని వారు పేర్కొంటున్నారు. 

తాజాగా, టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన బాట పట్టారు. అయితే, ఈ స్థలం హెచ్‌సీయూకు చెందదని, కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి కోసం 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, హెచ్‌సీయూ భూములు వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. 
HCU
Hyderabad Central University
Land Auction
Student Protest
Telangana
Revanth Reddy
SFI
Bhatti Vikramarka
Shravan Kumar
TGIIIC

More Telugu News