Myanmar Earthquake: మయన్మార్ లో మాటలకందని ప్రకృతి బీభత్సం... ఉపగ్రహ చిత్రాలు ఇవిగో!

Devastating Myanmar Earthquake Satellite Images Reveal Unthinkable Destruction
  • శుక్రవారం నాడు మయన్మార్ లో భారీ భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో ప్రకంపనలు
  • ఇప్పటివరకు 1700 మంది మరణించారన్న మయన్మార్ ప్రభుత్వం
మయన్మార్ లో శుక్రవారం నాడు సంభవించిన భారీ భూకంపం మాటలకందని విలయాన్ని సృష్టించింది. ఇప్పటివరకు 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు తొలగిస్తుంటే దుర్వాసన వస్తుండడంతో, అక్కడ ఇంకా మృతదేహాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.

కాగా, మయన్మార్ భూకంపానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రకృతి ఎలా బీభత్సం సృష్టించిందన్నది ఆ శాటిలైట్ చిత్రాలు కళ్లకు కట్టినట్టు చెబుతున్నాయి. విమానాశ్రయాలు, రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. నైపిడా విమానాశ్రయ నియంత్రణ టవర్ కూలిపోయింది. విమానాశ్రయం దెబ్బతినడంతో భారతదేశం, చైనా నుండి సహాయక బృందాలను తీసుకువస్తున్న విమానాలు నేరుగా మాండలే, నైపిడాకు వెళ్లకుండా యాంగోన్ విమానాశ్రయంలో దిగవలసి వచ్చింది. ఇరావతి నదిపై ఉన్న ఇన్వా వంతెన కూడా కూలిపోయింది. 

కొన్ని చోట్ల జనావాసాల ఉనికే కనుమరుగైంది. అక్కడక్కడ మిగిలి ఉన్న రోడ్లను బట్టి అక్కడ జనావాసాలు ఉండేవన్న విషయం ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. 

మయన్మార్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం కొనసాగుతున్న కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. స్థానిక ప్రజలు ఎటువంటి భారీ పరికరాలు లేకుండా చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్నారు. మయన్మార్ సైనిక పాలకులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఇప్పటివరకు 1700 మంది మరణించారని, 3400 మంది గాయపడ్డారని, 300 మందికి పైగా గల్లంతయ్యారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మాండలే నగరంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోయాయి. సమాచార వ్యవస్థ స్తంభించింది. దీని తరువాత 6.7 తీవ్రతతో మరో ప్రకంపన సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మాండలే నగరంలో చాలామంది నిరాశ్రయులయ్యారు. మరికొందరు భయంతో వీధుల్లోనే రాత్రులు గడుపుతున్నారు. ఆదివారం సాయంత్రం 5.1 తీవ్రతతో సంభవించిన మరో ప్రకంపనతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. 
Myanmar Earthquake
Myanmar
Earthquake Damage
Satellite Images
Natural Disaster
Mandaley
Naypyidaw
Irrawaddy River
Death Toll
Relief Efforts

More Telugu News