India: మయన్మార్ కు మరింత సాయం అందించిన భారత్

India Provides Further Aid to Myanmar After Devastating Earthquake
  • భారీ భూకంపాలతో మయన్మార్ అతలాకుతలం
  • మరోసారి సాయం పంపిన భారత్
  • 30 టన్నుల విపత్తు సాయం నౌకల్లో తరలింపు
  • ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోందన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్
భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు అంతర్జాతీయ సహాయం అందించడంలో భారత్ ముందువరుసలో ఉంది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయ సామాగ్రి అందజేసేందుకు 'ఆపరేషన్ బ్రహ్మ' పేరిట భారత్ హుటాహుటిన రంగంలోకి దిగింది.

శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించగా, శనివారం ప్రధాని మోదీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించడం జరిగింది. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని తరలించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని యాంగోన్‌కు పంపించారు.

భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కర్మూక్, ఎల్ సీ యూ 52 లలో 30 టన్నుల సాయాన్ని పంపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. బాధిత దేశానికి సహాయం అందించే ఈ కార్యక్రమానికి 'ఆపరేషన్ బ్రహ్మ'గా నామకరణం చేశారు. ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.

మయన్మార్, థాయ్ లాండ్‌లో శుక్రవారం రెండు సార్లు శక్తివంతమైన భూకంపాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 7.7, 7.4 తీవ్రతతో భూకంపాలు సంభవించగా, భారీ భవనాలు కుప్పకూలాయి. దాదాపు 1700 మందికిపైగా మృత్యువాత పడగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.

ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌లో భూకంపాలు సంభవించగానే భారత ప్రధాని మోదీ విపత్తుపై ఆరా తీశారు. మయన్మార్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 
India
Myanmar
Earthquake
Relief
Operation Brahma
Natural Disaster
Jaishakar
Modi
Myanmar Earthquake Relief
International Aid

More Telugu News