Donald Trump: మూడోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్.. మార్గాలున్నాయన్న అధ్యక్షుడు

Trump Eyes Third US Presidential Term Possible Paths Revealed
  • వీలైతే మూడు, నాలుగోసారి కూడా అధ్యక్షుడు కావాలని కలలు కంటున్న ట్రంప్
  • బహిరంగంగానే పలుమార్లు వెల్లడించిన అధ్యక్షుడు
  • అందుకు చాలానే మార్గాలున్నాయన్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్ మరోమారు అధ్యక్షుడు కావాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తీ రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిని అధిష్ఠించడానికి వీల్లేదు. అయితే, ట్రంప్ మాత్రం మూడోసారి, వీలైతే నాలుగోసారి కూడా వైట్‌హౌస్‌ను ఏలాలని కలలుకంటున్నారు. మూడోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించడంపై ఆయన పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

రాజ్యాంగం అనుమతించకపోయినా.. మూడోసారి అధ్యక్షుడు కావడానికి చాలా మార్గాలు ఉన్నాయని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. తాను ‘జోక్’ చేయడం లేదని కూడా చెప్పారు. తనను మూడోసారి కూడా అధ్యక్షుడిగా చూడాలని చాలామంది కోరుకుంటున్నారని ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. మరోమారు అధ్యక్షుడు కావాలనుకుంటున్నారా? అందుకు ఏమైనా వ్యూహాలున్నాయా? అన్న ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. అందుకు మార్గాలున్నాయని చెప్పారు. అయితే, దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరిలో నెవడాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికాకు ఒకటి రెండుసార్లు కాదు, మూడునాలుగుసార్లు సేవ చేయడం జీవితంలో గొప్ప గౌరవం అవుతుందని పేర్కొన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాలు తాను విశ్రాంతి తీసుకోబోనని స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో ఇటీవల నిర్వహించిన బ్లాక్ హిస్టరీ మంత్ కార్యక్రమంలో ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మరోసారి పోటీ చేయాలా?’ అని అడిగారు. దానికి వారు ‘మరో నాలుగేళ్లు’ అని నినాదాలు చేశారు.

ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో అధ్యక్ష పదవికి పోటీ చేయించి, ఆ తర్వాత ఆయన దిగిపోయి ట్రంప్‌కు బాధ్యతలు అప్పగించడం ట్రంప్ ముందున్న మార్గాల్లో ఒకటి. ఇలా చేయొచ్చని ట్రంప్ కూడా చెప్పారు. అయితే, మిగతా మార్గాలను మాత్రం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. మరోమార్గం రాజ్యాంగాన్ని సవరించడం. ఇందుకు కాంగ్రెస్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. 

మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై ట్రంప్ గతంలోనూ వ్యాఖ్యలు చేసినప్పటికీ రిపబ్లికన్లు వాటిని జోక్‌గా, విమర్శకులను రెచ్చగొట్టే ప్రయత్నంగా కొట్టిపడేశారు. అయితే, టెనెస్సీ రిపబ్లికన్ ప్రతినిధి ఆండీ ఒగ్లెస్ ప్రస్తుతం ఉన్న రెండు సార్లు పదవీకాల పరిమితిని తొలగించే తీర్మానాన్ని ప్రతిపాదించడం ద్వారా ట్రంప్ మూడోసారి బరిలోకి దిగుతారనే సంకేతాలు ఇచ్చారు.
Donald Trump
US Presidential Election
Third Term
US Constitution
White House
Republican Party
Andy Ogles
JD Vance
Political Strategy
American Politics

More Telugu News