Donald Trump: అమెరికాలో డజను గుడ్లు ఎంతో తెలుసా?

Americas Egg Crisis High Prices and Import Challenges
  • అమెరికాలో అమాంతం పెరిగిపోయిన కోడి గుడ్ల ధరలు
  • డజను గుడ్ల ధర రూ.855లకు చేరిన వైనం
  • పెరుగుతున్న గుడ్ల ధరల పట్ల ఆందోళన
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలపై సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. భారత్ సహా పలు దేశాలపై పరస్పరం సుంకాలు విధించాలని నిర్ణయించిన ట్రంప్‌కు కోడిగుడ్లు తలపోటు తెప్పిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కోడిగుడ్డు ధర ట్రంప్ యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

పోషక విలువలు కలిగిన కోడిగుడ్ల వినియోగం అమెరికాలో ఎక్కువగానే ఉంటుంది. అయితే, తగ్గిన ఉత్పత్తి, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అమెరికాలో కోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి కోడిగుడ్లను కూడా స్మగ్లింగ్ చేసేంత దారుణంగా పరిస్థితి నెలకొంది. కొన్ని నగరాల్లో డజను కోడిగుడ్ల ధర పది డాలర్లకు (దాదాపు రూ.855) చేరింది.

అమెరికాలో గుడ్ల ధరలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. బర్డ్ ఫ్లూ హెచ్ 5ఎన్1, ఏవియన్ ఇన్ఫ్లూఎంజా మహమ్మారి కారణంగా 2022 నుంచి దాదాపు 15 కోట్లకు పైగా కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1.9 కోట్ల కోళ్లు చనిపోయాయి. దీంతో గుడ్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది.

ప్రస్తుతం అమెరికా పలు యూరప్ దేశాల నుంచి గుడ్లను దిగుమతి చేసుకునేందుకు సిద్ధమవుతోంది. టర్కీ, దక్షిణ కొరియాల నుంచి కోడిగుడ్లు కొనుగోలు చేయాలని అమెరికా భావిస్తోంది. అయితే, ట్రంప్ అనేక దేశాలపై పరస్పర సుంకాలు ప్రకటించిన కారణంగా అమెరికా గుడ్లు కొనుగోలు చేయడం అంత సులువు కాదు. గుడ్లను దిగుమతి చేసుకోవాలనే అమెరికా ప్రతిపాదనను పోలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ తిరస్కరిస్తున్న నేపథ్యంలో గుడ్ల దిగుమతి సవాల్‌గా మారుతోంది. 
Donald Trump
US Egg Prices
Bird Flu
Egg Shortage
H5N1
Avian Influenza
Egg Import
Trade Tariffs
Turkey
South Korea

More Telugu News