Sridevi: విద్యార్థి తండ్రితో టీచర్ అఫైర్.. ఆపై రూ. 20 లక్షల డిమాండ్!

Teachers Affair and Extortion 20 Lakh Rupees Demand in Bengaluru
  • స్కూలుకు వచ్చిన విద్యార్థి తండ్రితో పరిచయం పెంచుకున్న టీచర్
  • ఆపై మరింత ముదిరిన స్నేహం
  • అవసరానికి రూ. 4 లక్షలు తీసుకున్న టీచర్
  • వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టి మరో రూ. 20 లక్షల డిమాండ్
  • టీచర్, మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
విద్యార్థి తండ్రితో అఫైర్ పెట్టుకుని ఆపై బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్న ఉపాధ్యాయురాలిని బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి భార్య, ముగ్గురు కుమార్తెలతో జీవిస్తున్నారు. ఐదేళ్ల చిన్న కుమార్తెను 2023లో స్కూల్‌లో చేర్చారు. అడ్మిషన్ సమయంలో ఆయనకు ఉపాధ్యాయురాలు శ్రీదేవితో పరిచయం ఏర్పడింది. 

ఆ పరిచయం పెరిగి పెద్దది కావడంతో తరచూ వీడియో కాల్స్ చేసుకునేవారు, మెసే‌జ్‌లు పంపుకొనేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్, సిమ్‌కార్డు తీసుకున్నారు. ఆ పరిచయం మరింత పెరగడంతో అవసరం పేరుతో ఆయన నుంచి రూ. 4 లక్షలు తీసుకుంది. ఈ జనవరిలో మరో రూ. 15 లక్షలు అడిగింది. ఇచ్చేందుకు ఆయన సంశయించడంతో రూ. 50 వేలు అప్పు తీసుకునే నెపంతో ఆమె నేరుగా ఆయన ఇంటికి వెళ్లింది.

మరోవైపు, ఆయన వ్యాపారం దెబ్బతినడంతో కుటుంబంతో కలిసి తిరిగి గుజరాత్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కుమార్తె ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ అవసరమైంది. అందుకోసం గత నెలలో ఆయన స్కూలుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ గణేశ్ కాలె (38), సాగర్ (28) ఉన్నారు. అక్కడాయనకు ఊహించని షాక్ తగిలింది. శ్రీదేవితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించిన వారు రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వాటిని ఆయన కుటుంబానికి పంపుతామని బెదిరించారు. దీంతో ఆయన తన పరిస్థితి వివరించి రూ. 15 లక్షలకు వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా తొలుత రూ. 1.9 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారు. 

మార్చి 17న శ్రీదేవి ఆయనకు ఫోన్ చేసి మిగతా డబ్బుల కోసం గుర్తు చేసింది. దీంతో ఇక లాభం లేదని ఆయన పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీదేవి, సాగర్, కాలెలను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sridevi
Bangalore Crime Branch
Blackmail
Teacher Student Father Affair
20 Lakh Demand
Arrest
Bengaluru Teacher
Extortion
Ganesha Kale
Sagar

More Telugu News