Tulasi Reddy: జమిలి ఎన్నికలపై బీజేపీ నాయకుల వాదనల్లో నిజం లేదు: తులసిరెడ్డి

Congress Leader Criticises BJPs One Nation One Election Proposal
  • జమిలి ఎన్నికల నిర్ణయం పిచ్చి తుగ్లక్ చర్య
  • జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం
  • రాజ్యాంగాన్ని సవరించేంతటి మెజారిటీ ఎన్డీయే ప్రభుత్వానికి లేదు
  • కడపలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
జమిలి ఎన్నికల విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న వాదనల్లో నిజం లేదని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేసి దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలనే మోదీ ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమన్నారు. కడప జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం పిచ్చి తుగ్లక్ చర్య అని విమర్శించారు.

జమిలి ఎన్నికల ద్వారా కలిగే ప్రయోజనాలను ముందుగా దేశ ప్రజలకు చెప్పాలని బీజేపీ చీఫ్ నడ్డా అనడం విడ్డూరంగా ఉందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేసేంతటి మెజారిటీ ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభలో ఎన్డీయే ప్రభుత్వానికి లేదని తెలిపారు. 

జమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుందని బీజేపీ నాయకులు చెప్పడంలో నిజం లేదన్నారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ నినాదం నియంతృత్వానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే ఎన్నికలు లేని దేశం స్థాయికి భారత్ చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి జమిలి ఎన్నికల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.
Tulasi Reddy
BJP
Simultaneous Elections
Modi Government
Indian Politics
AP Congress
Constitutional Amendment
Election Expenses
One Nation One Election
Nadda

More Telugu News