Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో విషాద ఘ‌ట‌న‌.. బావిలోని విష వాయువుల‌ను పీల్చి 8 మంది మృతి!

8 Die After Inhaling Poisonous Gas in Madhya Pradesh Well
  • 150 ఏళ్ల‌ పురాతనమైన బావిని శుభ్రం చేసే క్ర‌మంలో తీవ్ర విషాదం
  • గంగౌర్ పండుగ వేడుకల్లో భాగంగా విగ్రహ నిమజ్జనం కోసం బావి క్లీనింగ్‌
  • ఈ ఘ‌ట‌న‌పై సీఎం మోహన్ యాదవ్ సంతాపం
  • మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన‌
మధ్యప్రదేశ్‌లో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఖాండ్వా జిల్లా ప‌రిధిలోని కొండావత్ గ్రామంలో బావిని శుభ్రం చేసే క్ర‌మంలో అందులోని విష వాయువుల‌ను పీల్చి ఎనిమిది మంది మృతిచెందారు.

గంగౌర్ పండుగ వేడుకల్లో భాగంగా విగ్రహ నిమజ్జనం కోసం గ్రామస్తులు గురువారం బావిని సిద్ధం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. బావిలో పేరుకుపోయిన బురదను తొలగించడానికి ఐదుగురు గ్రామస్తులు మొదట 150 ఏళ్ల‌ పురాతనమైన బావిలోకి దిగారు.

అయితే, వారు అందులోని విష వాయువుల కార‌ణంగా స్పృహ కోల్పోయారు. ఆ త‌ర్వాత‌ బుర‌ద‌లో మునిగిపోవడం ప్రారంభించారు. దాంతో వారిని కాపాడేందుకు మరో ముగ్గురు గ్రామస్తులు సహాయం కోసం బావిలోకి దిగారు. కానీ విష వాయువుల ప్రభావంతో వారు కూడా అందులోనే చిక్కుకుపోయారు.

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న‌ జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్‌ బృందాలు బావి వ‌ద్ద‌కు చేరుకున్నాయి. నాలుగు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి, ఎనిమిది మృతదేహాలను ఒక్కొక్కటిగా బావి నుంచి వెలికి తీశారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

ఇక ఈ తీవ్ర విషాదం నేప‌థ్యంలో గ్రామస్తులు... భవిష్యత్తులో మ‌రోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి బావిని మూసివేయాలని నిర్ణయించారు. బావిలోని విషపూరిత వాయువులలు, ఊపిరాడక నీటిలో మునిగిపోవడానికి దారితీశాయని ప్రాథమికంగా తేలినందున, జిల్లా యంత్రాంగం దర్యాప్తున‌కు ఆదేశించింది.
Madhya Pradesh
Khandwa
Kondawat
well death
poisonous gas
tragedy
eight deaths
Mohan Yadav
Madhya Pradesh CM
accident

More Telugu News